Peddapally | పెద్దపల్లి, జూన్ 17:మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని డీఆర్డీవో కాళిందిని అన్నారు. పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్ ప్రాజెక్టుపై మంగళవారం నిర్వహించిన ఒక్కరోజు అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యతతో కుట్టెందుకు ఒక్కో మహిళా సభ్యురాలిపై రోజుకు రూ.200 ఖర్చు చేస్తూ 10 రోజులు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు.
బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి మహిళలకు శాశ్వతంగా కుట్టు పని ఉండేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రభుత్వం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ర్యాంప్ ప్రాజెక్టు కింద ఎంఎస్ఎంఈ రంగంలో చిన్న చిన్న వ్యాపారాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన సంపూర్ణ సహాయక సహకారాలు అందిస్తామని, స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక రంగంలో ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. ఈనెల 20 నుంచి రాఖీల తయారీ చేయడంపై శిక్షణ అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.