MLA Makkan Singh | కోల్ సిటీ, ఆగస్టు 13: హరిత రామగుండం నిర్మాణం అందరి లక్ష్యంగా పని చేద్దామని, మొక్కల సంరక్షణ ఈసారి మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జరిగిన వన మహోత్సవం కార్యక్రమంకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీతో కలిసి ఆయన ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ భావితరాల ప్రజలు ప్రాణవాయువును కొనుగోలు చేసుకునే పరిస్థితి రావొద్దంటే మన ముందు తరాలు మొక్కలు నాటి మనకు పర్యావరణంను అందించినట్లే మనం కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.
ప్రతీ మహిళ ఈ వన మహోత్సవంలో భాగస్వాములు కావాలన్నారు. మొక్కల పెంపకంకు రూ.కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా మహిళా సంఘాలకే సంరక్షణ పనులు అప్పగించామని తెలిపారు. ప్రతీ మహిళ తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద మొక్కలు నాటాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాలను చైతన్యపరిచి సబ్సిడీ రుణాలు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. అంతర్గాంలో మహిళల ఉపాధి కోసం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో ఫంక్షన్ హాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ మాట్లాడుతూ వన మహోత్సవంలో ఈ ఏడాది రామగుండం బల్దియాకు 4,80,000 మొక్కలు నాటాలని లక్ష్యం విధించినట్లు తెలిపారు.
ఇందులో 1,92,000 మొక్కలు ఇంటింటికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నర్సరీలతోపాటు 50వేల మొక్కలు హెచ్ఎండీఏ సర్సరీల నుంచి తెప్పించామన్నారు. మెప్మా ఆర్పీలు రిజిష్టర్లో నమోదు చేసుకొని మొక్క పెరుగుతున్న తీరును రికార్డు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, వన మహోత్సవం డీఈఈ షాబాజ్, ఏఈ తేజస్విని, జూనియర్ అసిస్టెంట్ సాయి, మెప్మా టీఎంసీ మౌనికతోపాటు మాజీ కార్పొరేటర్లు, స్వశక్తి మహిళలు పాల్గొన్నారు. అనంతరం మల్కాపూర్ శివారు డంపింగ్ యార్డులో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.83 లక్షల వ్యయంతో డీఆర్సీ, కంపోస్ట్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.