కలెక్టరేట్ ( కరీంనగర్) : జాతీయ ఉపాధి హామీ పథకంలో (National Employment Guarantee Scheme) పనిచేస్తూ, భూమి లేని కూలీలకు కూడా ఆర్ధిక సాయమందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మీయ భరోసా ( Aatmiya Barosa) పథకాన్ని అమలు చేస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యే రోజులను బట్టి, ఈ పథకానికి ఎంపిక చేస్తుండగా, భూమి లేని నిరుపేదలంతా, ఉపాధి పనులు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. జాబ్ కార్డులు పొందేందుకు అనేక మంది దరఖాస్తులు చేసుకున్నారు.
2022-23లో ఉపాధి హామీ పనులు చేసి భూమి లేని నిరుపేదలను ఈ పథకానికి అర్హులుగా ప్రకటించి కొంత మందికి జాబ్ కార్డులు అందజేసింది. తమకు కూడా కార్డులొస్తాయనే ఆశతో ఉన్న వారికి ఏడాదికాలంగా నిరాశే ఎదురవుతుంది. కొద్దిరోజుల క్రితం జాబ్‌కార్డుల దరఖాస్తు సైట్‌ను మూసివేశారు. ఆత్మీయ భరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి కొత్తగా జాబ్‌కార్డులు ఇవ్వడం నిలిపివేయడంతో జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో కూలీలు ఉపాధి పనులకు వెళ్లలేకపోతున్నారు.
ప్రస్తుతం వ్యవసాయ పొలాలన్ని పొట్ట, కొత్త దశల్లో ఉండటంతో పనులు తగ్గాయి. ఈ దశలో గ్రామీణ ప్రజలు ఉపాధి పనుల వైపు దృష్టి సారించారు. కొత్త జాబ్‌కార్డులు ( Job Cards 0 మంజూరు ప్రస్తుతం లేకపోగా, తిరిగి ఎప్పుడు అవకాశం కల్పిస్తారో తెలియక కూలీలు ఆందోళన చెందుతున్నారు. పనులు లేక కొందరు ఇతర ప్రాంతాలకు వలసలు పోతుంటే, మరికొందరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంటి వద్దనే ఖాళీగా ఉంటున్నారు. ఇప్పటికైనా స్పందించి కొత్త జాబ్ కార్డులు మంజూరు చేసి, తమకు ఆత్మీయ భరోసాకు అర్హత పొందే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
సైట్ తెరవగానే జాబ్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ : శ్రీధర్, డీఆర్డీవో( DRDO)
ప్రస్తుతం కొత్త జాబ్‌కార్డులు మంజూరుకు అవకాశం లేదు. దీనికి సంబంధించిన ఆప్షన్ ప్రస్తుతం నిలిపివేశారు. తిరిగి సైట్ తెరవగానే, దరఖాస్తులు తీసుకుని, కూలీలకు జాబ్‌కార్డులు అందజేస్తామని కరీంనగర్ డీఆర్డీవో శ్రీధర్ వెల్లడించారు.