ఒకప్పుడు యాసంగి సీజన్ వచ్చిందంటే.. వానకాలం వరికోసిన కొయ్యకాలు, బీడువారిన భూములే కనిపించేవి. కేవలం నీటి వసతి ఉన్నచోట పచ్చని పొలాలు అరకొరగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ తోడ్పాటుతో నీటి లభ్యత పెరుగడం, విత్తనాలు, ఎరువుల అన్నీ అందుబాటులో ఉండడంతో కాలమేదైనా రైతాంగం సాగుకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నది.
-తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 10
తిమ్మాపూర్ మండలంలో వానకాలం 18వేల ఎకరాల్లో వరి పంట సాగు కాగా, యాసంగిలో మరో వెయ్యి ఎకరాల విస్తీర్ణం అదనంగా పెరుగనున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు వేస్తున్నారు. వానకాలంలో కూరగాయలు, మక్క, పత్తి పూర్తయిన పంటల స్థానాల్లో వరిని వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. మిడ్‌మానేరు నుంచి మండలంలోని సగం గ్రామాలకు కాలువ ద్వారా నీరు అందనున్నది. అలాగే ఎల్ఎండీ రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో పరిసర ప్రాంత గ్రామాల భూగర్భజలాలు పెరిగాయి. ఈ భరోసాతోనే రైతులు వానకాలం కంటే ఎక్కువ సాగు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
యాసంగి వరి పంట వేయడానికి ఇప్పటికే సగం వరకు రైతులు వరినార్లు పోశారు. మరో సగం మంది నారుమడులు దున్ని నారు పోయడానికి సిద్ధమవుతున్నారు. నారు మడుల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలని, సస్యరక్షణ చర్యలు చేపడితేనే నారు సరిగ్గా పెరుగుతుందని అధికారులు సూచనలు చేస్తున్నారు. అలాగే 25రోజుల నుంచి నెలలోపే నాటు వేయాలని చెబుతున్నారు. నాట్లు ఆలస్యమైతే వరి పొట్ట దశలో నీటి ఎద్దడి ఏర్పడితే పంట చేతికి అందదని సూచిస్తున్నారు.
యాసంగిలో వరిసాగు ఎంత విస్తీర్ణంలో సాగవుతుందో.. ఆ మేరకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచారు. సొసైటీలు, డీసీఎంఎస్‌లతో పాటు ప్రైవేటు డీలర్ల వద్ద నిల్వలు సిద్ధంగా పెట్టారు. రైతులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా అన్నీ సమకూర్చారు. విత్తనాల నుంచి ఎరువుల దాక అందుబాటులో ఉండడంతో రైతులు ఏ ఇబ్బందీ లేకుండా కొనుగోలు చేసుకుని సాగుకు వినియోగించుకుంటున్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి త్వరలో రైతుబంధు సైతం విడుదల కానున్నట్లు జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు సంతోషంగా ఉన్నారు. బ్యాంకు ఖాతాల్లో ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున జమ కానుండగా, పెట్టుబడికి ఎంతో ఆసరా అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు సమకూర్చుతున్న ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రైతులు నారు మడుల్లో యాజమాన్య పద్ధతులుపాటించాలి. అలాగే ఎరువులను అధికంగా వినియోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరైన మోతాదులో వాడితేనే పంటకు ఉపయోగపడుతుంది. రైతులు సలహాలు, సూచనల కోసం తమ క్లస్టర్ పరిధిలోని ఏఈవో, లేదా మమ్మల్ని సంప్రదించవచ్చు.
-సురేందర్, వ్యవసాయాధికారి, తిమ్మాపూర్