KTR, Photo Must | సిరిసిల్ల టౌన్, మే 24: ప్రజల ఆశీర్వాదంతో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఫొటో అధికారిక కార్యక్రమాలలో పెట్టకపోతే ఇకపై బీఆర్ఎస్ సైనికులు ఊరుకోబోరని బీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు మాట్ల మధు హెచ్చరించారు. సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కేకే మహేందర్‌రెడ్డి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. కలెక్టరు అంతగా ప్రేమ ఉంటే మహేందర్‌రెడ్డిని ప్రైవేటు ప్రోగ్రాంలకు పిలుచుకోవాలని హితవుపలికారు. వడ్ల కొనుగోలు కేంద్రాలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాలలో చట్టబద్దంగా గెలిచిన కేటీఆర్ ఫొటో లేకుండా అధికారిక కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు.
కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గంభీరావుపేటలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ ఫోటో లేదని అడిగిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో బాగంగా నియోజకవర్గంలో జరుగుతున్న అనేక అధికారిక కార్యక్రమాలలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన మహేందర్‌రెడ్డికి ప్రాధాన్యత కల్పించడం విడ్డూరంగా ఉందన్నారు.
శని, ఆదివారాల్లో మాత్రమే సిరిసిల్లకు వచ్చే నాయకుడు నేడు కేవలం కాంగ్రెస్ అధికారంలో ఉందని మాత్రమే స్థానికంగా పర్యటిస్తున్నాడని చెప్పారు. బద్దెనపల్లిలో పంచాయితీ కార్యదర్శిపై మహేందర్‌రెడ్డి అనుచరులు కులపరంగా అవమానపరిచిన కలెక్టర్ కనీసం పట్టించుకోలేదన్నారు. రాబోవు రోజులలో కేటీఆర్ ఫోటో లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే తాము సహించబోమని స్పష్టం చేశారు.
గతంలోనూ అపెరల్ పార్కులో జరిగిన కార్యక్రమంలో అధికార పార్టీ నాయకుల ఫోటోలు సైతం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేషన్ దుకాణాల నుండి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వరకు కాంగ్రెస్ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండెపెల్లికి చెందిన వ్యక్తి సౌదిలో ప్రమాదంలో గాయపడితే సొంత ఖర్చులతో బాదితుడికి తీసుకువచ్చిన ఘనత కేటీఆర్ కు మాత్రమే దక్కుతుందన్నారు. కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు మెగంని మనోహర్ మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా ఎన్నికైన కేటీఆర్ ఫొటో విషయంలో ప్రోటోకాల్ పాటించకపోతే సదరు కార్యక్రమాలన్నింటినీ అడ్డుకుంటామని తెలిపారు.
శాంతిభద్రతకు విఘాతం కలిగించవద్దనే ఉద్దేశ్యంతోనే శాంతియుతంగా ఉంటున్నామని గుర్తుంచుకోవాలన్నారు. అభివృద్ధి విషయంలో కేటీఆర్ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతారని కొనియాడారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో పూర్తిగా కాంగ్రెస్ కు సంబంధించిన వారికి మాత్రమే కేటాయిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, ఇదే నిజమైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
బీఆర్ఎస్ యూత్ నాయకుడు సిలువేరి చిరంజీవి మాట్లాడుతూ సిరిసిల్లలో ప్రోటోకాల్ ఎందుకు విస్మరిస్తున్నారో తమకు అర్ధం కావడంలేదన్నారు. ఇటీవల సిరిసిల్లలో జరిగిన కార్యక్రమంలో స్వయానా సొంత పార్టీకి చెందిన ప్రభుత్వ విప్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైందన్నారు. మహేందర్‌రెడ్డికి ప్రజలే ప్రోటోకాల్ ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కేటీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందన్నారు. పదేండ్ల కాలంలో అభివృద్ధితో పాటు శాంతిభద్రతల విషయంలోనూ ముందు వరసలో ఉందన్నారు. నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగితే సదరు కార్యక్రమాన్ని బీఆర్ఎస్ అడ్డుకొని తీరుతుందని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకుడు శీలం స్వామి, వేముల నరేష్ , మెరుగు తిరుపతి, కిరణ్ బండి జగన్, గుండు ప్రేమ్ కుమార్, భాస్కర్ గౌడ్, జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.