కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 7 : కరీంనగర్లో వివిధ నిధుల కింద చేపట్టిన పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేస్తామని మేయర్ యాదగిరి సునీల్‌రావు స్పష్టం చేశారు. స్మార్ట్‌సిటీ నిధులతో మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో చేపడుతున్న అభివృద్ధి పనులను జూలై చివరి నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కరీంనగర్ మల్టీపర్పస్ స్కూల్ మైదానంలో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ నిధులు 5.50 కోట్లతో ఈ పార్కును అభివృద్ధి చేస్తున్నామన్నారు. అందులో 2 కోట్లతో మ్యూజికల్ పౌంటేన్, 1.50 కోట్లతో వాకింగ్ ట్రాక్, 50 లక్షలతో పిల్లల ఆడుకునేందుకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేశామని చెప్పారు. ఓపెన్ థియేటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం పిల్లలు, పెద్దలు సేదతీరే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ తీరు వల్ల గతంలో నెమ్మదిగా పనులు సాగినా ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. సీఎం అస్యూరెన్స్ నిధులతో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, ఎన్నికల కోడ్‌కు ముందు ప్రారంభించిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులను రెండు రోజుల్లో ప్రారంభించి, వర్షాలకు ముందుగానే పూర్తి చేస్తామన్నారు. ఈ వానకాలంలో నగరంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచామన్నారు. హెల్ప్ లైన్ నంబర్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, వానకాలంలో వచ్చే అన్ని సమస్యలపై ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయిస్తున్నామన్నారు. నగరంలో విలీనమైన గ్రామాల పరిధిలోని డివిజన్లలో పూర్తిస్థాయిలో మంచినీటి సరఫరా చేసేందుకు 147 కోట్లతో టెండర్ల పక్రియను పూర్తి చేశామన్నారు. ఈ పనులు వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా 10 ఎంఎల్డీ ఫిల్టర్‌బెడ్ నిర్మిస్తున్నామని, రిజర్వాయర్లు, మంచినీటి పైపులైన్ల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. ఎల్ఎండీలో 10 టీఎంసీల నీటి నిల్వ ఉంటే నగరంలో ఎప్పటి విధంగా రోజూ మంచినీటి సరఫరా చేస్తామన్నారు. స్మార్ట్‌సిటీతో చేపడుతున్న చౌరస్తాల సుందరీకరణ పనులను ఒక్కొక్కటి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అఖిల్, శ్రీకాంత్, మహేశ్, నాయకులు కోల సంపత్, బాలయ్య, ఇన్చార్జి ఎస్ఈ మహేందర్, ఈఈ యాదగిరి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.