MLA Dr. Kalvakuntla Sanjay | కోరుట్ల, ఆగస్ట్ 7: రాజకీయాల్లో హుందాతనంతో మెలగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై స్పందిస్తే బూతులు తిడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత ఉందని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరితే తొడకొట్టి ఛాలెంజ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు కాంగ్రెస్ నాయకులు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. అయిలాపూర్ గ్రామంలో ఇప్పటికీ రైతులకు యూరియా అందకా గంటల కొద్ది క్యూలైన్లో నిలబడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వహయాంలో 10 ఏళ్లు యూరియాకు కొరత లేకుండా చూశామని, ప్రజలకు తాగు, సాగునీటికి డోకా లేకుండా చేశామని, 24 గంటల పాటూ నిరంతరాయంగా కరెంట్ అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎస్సారెస్పీ వరద కాలువలు చుక్కా నీరు లేక అడుగంటి పోయాయన్నారు.
రైతులు సాగునీటి కోసం ఆరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పనితీరుపై విసుగు చెందారని స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం పాటుపడ్డ కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు ఆశీస్సులు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ పట్టణాధ్యక్షుడు సయ్యద్ ఫహీం, నాయకులు కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, సజ్జు, మహ్మద్ ఆతిక్, సందయ్య, గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.