తెలంగాణచౌక్, డిసెంబర్ 26: మతోన్మాద శక్తుల అగడాలను అరికట్టడానికి సీపీఐ శ్రేణులు పోరుకు సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పిలుపు నిచ్చారు. సీపీఐ 98 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ, అనుబంధ సంస్థల కార్యకర్తలతో సోమవారం తెలంగాణ చౌక్ నుంచి బస్‌స్టాండ్ కమాన్ చౌరస్తా మీదుగా పార్టీ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవనం వరకు భారీ ర్యాలీ చేట్టారు. పార్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఎరుగవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మహోజ్వల పోరాట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ కార్మిక, కర్షక ,బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ నిరంతర పోరాటాలను కొనసాగిస్తున్నదన్నారు. రాజ్యాంగబద్ధంగా పాలన సాగించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు, కార్మిక వర్గాలకు వ్యతరేకంగా చట్టాలను రూపొందిస్తూ, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకురేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళిత, గిరిజనుల మీద దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం అసన్నమైందని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పొనగంటి కేదారి, టేకుమల్ల సమ్మయ్య, కటికరెడ్డి బుచ్చన్న, మల్లవ్వ, పైడిపల్లి రాజు, బూడిద సదాశివ, మచ్చ రమేశ్, బోనగరి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
రామడుగులో..
రామడుగు, డిసెంబర్ 26 : మండలంలోని గోపాల్రావుపేట, గుండి, లక్ష్మీపూర్, రామడుగు, దేశరాజ్‌పల్లి తదితర గ్రామాల్లో సోమవారం సీపీఐ ఆవిర్భావ దిన సంబరాలు ఘనంగా జరుపుకొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మార్క్సిజం, లెనినిజంతో దోపిడీలేని వ్యవస్థకోసం సమ సమాజస్థాపనే లక్ష్యంగా, అంతరాలు లేని సమాజ శ్రేయస్సు కోసం 1915 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఆవిర్భవించిందని వెల్లడించారు. నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ పోరాటాలు సాగిస్తున్నదన్నారు.
సీపీఐ ఆవిర్భవించి 97 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకోసం ఎర్ర జెండా నీడలో సమరశీల పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గొడిశెల తిరుపతిగౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మచ్చ రమేశ్, నాయకులు రవీందర్‌రెడ్డి, గంటె రాజేశం, శంకరయ్య, మల్లేశం, లచ్చయ్య, దేవయ్య, నాంపెల్లి, హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.