పెద్దపల్లి, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ)/ మంథని/ మంథని రూరల్/ జమ్మికుంట : ‘రైజింగ్ తెలంగాణ’ అంటున్న ప్రభుత్వం సాగునీటి రంగంలో రైజింగ్‌లో ఉండకుండా.. ఏ రంగంలో ముందున్నా అది పెద్దగా ఫలితాలను చూపదని రామన్ మెగసేసే అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంత జలసంపద వృథాగా పోతుంటే ఇంకెక్కడి అభివృద్ధి అని ఆయన ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేది కేవలం సాగునీరేనని, జల సంపదను ఒడిసి పట్టుకొని సాగునీరుగా మలిచినప్పుడే రాష్ట్రం ధాన్యాగారమవుతుందని చెప్పారు.
ప్రజల ప్రయోజనం కోసం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంల పేల్చివేతలపై, జల సంపదను కొల్లగొట్టే విధంగా జరుగుతున్న కూల్చివేతలపై నిపుణులతో ‘పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్’ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం కూడా సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసంపై వెంటనే చర్యలు చేపట్టాలని, బాధ్యలను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ధ్వంసమైన చెక్‌డ్యాంలను సందర్శించారు.
తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్, ప్రజా నిఘా వేదిక అధ్యక్షుడు వీవీ రావు, మానేరు రివర్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు కరుణాకర్‌రెడ్డి, జర్నలిస్టు సలీంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల రాజేంద్రసింగ్ మాట్లాడారు. చెక్‌డ్యాంలు రైతులు, ప్రజలకు మేలు చేస్తాయని చెప్పారు. గత ప్రభుత్వంలో నీరు వృథాగా వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడేలా అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారని చెప్పారు. అలాంటి ప్రాజెక్టులను ఏ ప్రభుత్వం వచ్చినా సంరక్షించి సాగునీరు అందించాలన్నారు.
కానీ, ప్రస్తుతం తెలంగాణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నదన్నారు. డిసెంబర్ అంటే పూర్తిగా మాన్సూన్ సమయం అని, ఈ సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులైనా.. చెక్ డ్యాంలైనా కూలే అవకాశం ఉండదన్నారు. సాధారణంగా నీరు లీకేజీ అయినా, బుంగలు పడ్డా శిథిలాలు అన్ని కిందికే పోతాయన్నారు. కానీ, టన్నులకొద్ది శిథిలాలు వెనక్కి పడి ఉండడం చూస్తే కచ్చితంగా బ్లాస్టింగేనని స్పష్టమవుతున్నదన్నారు. తనుగుల, అడవిసోమన్‌పల్లి చెక్ డ్యాంలు ధ్వంసమైనట్టుగానే భావిస్తున్నామన్నారు. తాము ఎన్నో చెక్ డ్యాంలను కట్టించామని.. మరెన్నో చెక్‌డ్యాంలు చూశామని, కానీ ఇలా పేల్చివేతలు జీవితంలో చూడలేదన్నారు.
తెలంగాణలో మేడిగడ్డ ధ్వంసంపై, పెద్దపల్లి మండలం మూలసాల చెక్‌డ్యాం పేల్చివేత యత్నం, తనుగుల, అడవిసోమన్‌పల్లి చెక్ డ్యాంల ధ్వంసంపై పోలీసులకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి విచారణ జరగడం లేదని తెలిసిందని, ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఎవరైతే వీటిని పేల్చి వేశారో.. పేల్చివేతకు యత్నించారో అలాంటి దోషులను పట్టుకొని శిక్షించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల ధ్వంసంపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ను వేయాలని డిమాండ్ చేశారు.