BC Commission Chairman | జగిత్యాల, సెప్టెంబర్ 17: శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ అని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. జగిత్యాల జిల్లా సమీకృత భవన సముదాయంలో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బీ సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది కళలు, శిల్పకళ, వాస్తు శిల్పానికి ప్రతీక అని ఆయన సృష్టికర్త కావున, ఇంజనీర్లు, వాస్తు శిల్పులు, చేతి వృత్తుల వారు, మెకానిక్లు, ఫ్యాక్టరీ కార్మికులు ఈ పండుగను గొప్పగా జరుపుకోవాలని కోరారు. నేటి ఆధునిక ప్రపంచంలో, ఇంజనీర్లు, యంత్రాల రూపకర్తలు, సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా భావించాలి. శారీరక శ్రమకు, సృజనాత్మకతకు, వృత్తిపరమైన నైపుణ్యానికి గౌరవం ఇవ్వాలని మన పనిలో విజయం సాధించడానికి విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా, మన జీవితంలో జ్ఞానం, సృజనాత్మకత, శ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ, మన పనులు దైవికమైనవిగా, సృజనాత్మకమైనవిగా, సమాజానికి ఉపయోగపడేవిగా మారాలని విశ్వకర్మను ప్రార్థిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బీఎస్ లత, బీ రాజా గౌడ్, బీసీ సంక్షేమ అధికారిణి జీ సునీత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.