కరీంనగర్ విద్యానగర్, జూన్ 9 : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ, సీనియర్ వైద్యుడు, భీష్మ పితామహా వొంటేరి భూంరెడ్డి(91) సోమవారం కన్నుమూశారు. అస్వస్థతతో కెయిమ్స్ చల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) దవాఖానలో చేరిన ఆయన, సాయంత్రం 4:30 గంటలకు తుది శ్వాస విడిచారు. ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్‌గా పేరున్న ఆయన, యూరాలజీ, న్యూరో సర్జరీ కేసులకు పెట్టింది పేరుగా ప్రఖ్యాతి ఘటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పేదలకు వైద్య సేవే ఆస్తిగా భావించి చివరి వరకు సేవలందించారు. వైద్య విద్యార్థిగా పలు గోల్డ్ మెడల్స్ అందుకున్న భూంరెడ్డి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడిగా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
ఇతర దేశాల నుంచి ఎన్నో అవకాశాలొచ్చినా మాతృభూమిపై ఉన్న మమకారం.. ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే దృఢ సంకల్పంతో కరీంనగర్‌ను కేంద్రంగా చేసుకొని తొలినాళ్లలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలందించారు. భారత మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకి సైతం సర్జరీ చేసిన ఘనత పొందారు. కరీంనగర్లో లయన్స్ క్లబ్ రేకుర్తి కంటి దవాఖాన, శుశ్రుత క్యాన్సర్ దవాఖాన, కరీంనగర్ రెడ్-క్రాస్ సొసైటీ, ఐఎంఏ బిల్డింగ్ ట్రస్ట్, ఐఎంఏ హరితహారం వంటి వివిధ శాశ్వత ప్రాజెక్టులను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. కెయిమ్స్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తన దగ్గరకు వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించేవారు. భూం రెడ్డి 91ఏళ్ల వరకు కూడా ప్రజలకు సేవలందించడం గొప్ప విషయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఒక ప్రకటనలో ప్రశంసించారు. ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భూంరెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఉదయం 10.30 గంటలకు కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీ శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు. సోమవారం ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయం వద్ద వైద్యులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, కెయిమ్స్ చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేశ్, గౌరవ కార్యదర్శి డాక్టర్ సిరిపురం నవీన్ కుమార్, కోశాధికారి డాక్టర్ సీహెచ్ విజయ్ కుమార్, డాక్టర్ పీ కిషన్, మాజీ మేయర్ వై సునీల్‌రావు, సీనియర్ వైద్యులు మోహన్ రెడ్డి, అలీమ్, లక్ష్మణ్, అరుణ్ కటారి, ఎంఎస్ఎల్ స్రవంతి, స్వప్న, సునీల్ రెడ్డి, రవి, మేఘన, రాధిక, తదితరులు సంతాపం తెలిపారు.