గంగాధర/వేములవాడ రూరల్/రుద్రంగి/ బోయినపల్లి రూరల్, మే 24: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం పడిన అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. కేంద్రాల్లో వడ్లు పోసి నెలదాటినా ఇంకెప్పుడు వడ్లు కొంటారని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకొస్తున్నా.. ఇంకెప్పుడు కొంటారని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్, గంభీరావుపేట, రుద్రంగి, బోయినపల్లి మండలాల్లో వర్షం పడగా, కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది.
వడ్లు కొనాలని గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ధర్నా చేశారు. అదే విధంగా బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సందర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అకాల వర్షాలతో వడ్లు తడిసినా సర్కారుకు పట్టింపు లేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే తేమశాతంతో సంబంధం లేకుండా తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మాకున్న రెండెకరాల్లో వరి సాగుచేసిన. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని నెల క్రితం మా ఊళ్లే ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పోసిన. చెడగొట్టు వానలు పడుతుంటే వడ్లు నానకుండా పర్దాలు కప్పుకొంట ఆరిగోసపడ్డ. వడ్లు జోకుర్రి అని అడిగితే.. లైను ఇగ అత్తది అగ అత్తది అని చెప్పుకొంట జోకుతలేరు. నాలుగు రోజుల సంది వానలు మస్తుపడుతున్నయి. పర్దాలు కప్పినా లాభం లేకుండాపోయింది. వడ్లు మొలకచ్చినయి. మొలకెత్తిన వడ్లను కొని సార్లు మాకు న్యాయం చేయ్యాలె.
– తైద రవి, రైతు, కోట్లనర్సింహులపల్లి (గంగాధర)