చందుర్తి, జూలై 4: అది కిష్టంపేటలోని జిల్లా పరిషత్ పాఠశాల. ఒకప్పుడు బాగానే నడిచింది. కానీ, క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తున్నది. ఈ విద్యాసంవత్సరంలో పిల్లల సంఖ్య రెండుకు చేరింది. అయితే టీచర్లు మాత్రం ఆరుగురు ఉన్నారు. పొద్దున వస్తూ, తరగతి గదుల్లో కాలక్షేపం చేస్తూ సాయంత్రానికి ఇంటికెళ్తున్నారు. పిల్లలు సంఖ్య తక్కువగా ఉండడంతో ఉపాధ్యాయులు రోజుకు ఇద్దరి చొప్పున వంతులవారీగా పాఠశాలకు వస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గురువారం చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించగా.. ఉదయం 9:45గంటలైనా తలుపులు తెరుచుకోలేదు. అటెండర్ తాపీగా వచ్చి తలుపులు తెరువగా, 10 గంటలు దాటిన తర్వాత ముగ్గురు టీచర్లు స్కూల్‌కు వచ్చారు. హెచ్‌ఎంతోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు రాలేదు.
పిల్లలేని స్కూల్లో ఉపాధ్యాయులు ఏం చేస్తారని? వారిని ఇతర పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపాలని డీఈవోకు జడ్పీటీసీ విజ్ఞప్తి చేశారు. కాగా, జిల్లాలోని మెజార్టీ స్కూళ్లలో సరిపడా టీచర్లు లేకుండా బోధనకు ఇబ్బందులు అవుతుండగా, ఇక్కడ ఇద్దరు పిల్లలకు ఆరుగురిని నియమించి, ప్రజా ధనాన్ని వృథా చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం వెంకటేశ్వర్లను సంప్రదించగా.. తాను ఎస్టీవో బిల్స్ కోసం వెళ్లినట్టు చెప్పారు. ఒక ఉపాధ్యాయురాలు లాస్ట్ పే సర్టిఫికెట్ (ఎల్పీసీ) కోసం వెళ్లిందని, మరో ఉపాధ్యాయుడు పుస్తకరూప సమీక్షకు వెళ్లారన్నారు.