జమ్మికుంట, జనవరి 25: ‘ఈటల అహంకారి.. రాజకీయ గురువు కేసీఆర్‌నే మోసం చేసిన ఘనుడు. ఇక్కడ గెలిచిన తర్వాత ప్రజలకు కనిపించకుండా తిరుగుతున్నడు. బీజేపీ నుంచి ఒక్క పైసన్న తెచ్చిండా..? తట్టెడు మట్టెక్కడన్న పోసిండా..? చెప్పాలే. ఎమ్మెల్యేగా కోట్లు పెట్టి గెలిచానని మీడియాలో చెబుతున్నాడు. ఈసీ అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. క్రిమినల్ కేసు నమోదు చేయాలి. బిడ్డా ఖబడ్దార్.. 2023లో నేనే బరిలో ఉంటా’ అంటూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరుగలేదో చెప్పాలన్నారు. 24 గంటల విద్యుత్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. మంత్రిగా పని చేసిన ఈటల తన స్వగ్రామంలో బస్టాండ్, కుల సంఘాలకు ఒక్క భవనాన్ని నిర్మించలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. పేదల భూములు కబ్జా చేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవని, పార్టీలను, ప్రజాప్రతినిధులను, నాయకులను కొంటున్నది బీజేపీ కాదా..? అని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో హుజూరాబాద్‌లో నన్ను ఓడించడం నీతో కాలే.. కేసీఆర్ మీటింగ్ పెడితే ఓడిపోయానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఈటలకు డిపాజిట్ కూడా దక్కదన్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదని అంటున్న ఈటల, అధికారులు ఆహ్వానిస్తే ఎందుకు రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి, సంక్షేమం ఈటల జీర్ణించుకోవడం లేదని ఆరోపించారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని, అసెంబ్లీలో తీర్మానాలు చేసిన బిల్లులు ఆమోదించకుండా ఆపడం సబబా..? అని ప్రశ్నించారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు.ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్, జడ్పీటీసీ డాక్టర్ శ్యాం, నాయకులు దేశిని కోటి, రంజిత్, రమేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.