Lower Manair Dam | లోయర్ మానేరు డ్యాం వెలవెలబోతున్నది. ప్రస్తుతం నీటిమట్టం 7.354 టీఎంసీలకు చేరుకొని సాగుకు నీళ్లివ్వలేకపోతున్నది. ఈ నెల 7 నుంచే ఎస్సారెస్పీ నుంచి ఎగువ ఆయకట్టుకు కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నా, ఎల్ఎండీ నుంచి దిగువ ఆయకట్టుకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం 15 టీఎంసీలు ఉంటే గానీ, నీరందేలా లేదు.
మిడ్‌మానేరుకు ఎస్సారెస్పీతోపాటు కాళేశ్వరం నుంచి జలాలు వస్తున్నా, దిగువ మానేరుకు మాత్రం చుక్క రావడం లేదు. ఈ పరిస్థితుల్లోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నేరుగా ఎల్ఎండీకి నీటిని విడుదల చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది. అయితే, అధికారుల అనాలోచిత చర్యలతో ఎస్సారెస్పీకి వస్తున్న లక్షలాది క్యూసెక్కుల నీరు గోదావరిలో కలిసి, సముద్రం పాలవు
తుండడంపై రైతాంగం మండిపడుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : గోదావరి ఎగువ ప్రాంతంలో పడుతున్న భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతున్న తరుణంలో.. ఎస్సారెస్పీ పరిధిలోని లోయర్ మానేరు డ్యాం మాత్రం వెలవెలబోతున్నది. పోయిన యాసంగిలో దిగువ ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపి వేసిన తర్వాత రిజర్వాయర్‌లో కేవలం 5 టీఎంసీల నీళ్లు మిగిలాయి. తాగునీటి అవసరాల కోసం మధ్యమానేరు ద్వారా 2 టీఎంసీల నీటిని తీసుకొచ్చి నిల్వ చేశారు. వేసవిలో దాదాపు 2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించగా, జూన్ వరకు 5 టీఎంసీల నీళ్లే మిగిలాయి. సీజన్ ప్రారంభంలో వర్షాలు ముఖం చాటేయడంతో రిజర్వాయర్‌లోకి ఆశించిన నీరు రాలేదు.
ఇటీవల పడుతున్న వర్షాలతో మోయతుమ్మెదవాగు ద్వారా 2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మంగళవారం సాయంత్రం నాటికి రిజర్వాయర్‌లో 7.354 టీఎంసీ నీరు ఉంది. కనీసం 15 టీఎంసీలు చేరితే గానీ, దిగువ ఆయకట్టుకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. అడపాదడపా కురుస్తున్న వర్షాల ఆధారంగా ఆయకట్టు రైతులు నార్లు పోసుకుని, నాట్లు వేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేస్తే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. గోదావరిలో వరద ఉధృతంగా ఉన్నపుడే కొంత నీటిని ఎల్ఎండీకి తరలిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 7 నుంచే ఎగువకు నీళ్లు
కాకతీయ ఎగువ కాలువ పరిధిలోని ఆయకట్టుకు ఈ నెల 7 నుంచే నీటిని విడుదల చేస్తున్నారు. కానీ, దిగువ మానేరులో ఆశించిన నీరు లేక పోవడంతో ఇప్పటి వరకు కనీసం నీటి ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందించ లేదు. ప్రతిరోజూ 5 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ఆయకట్టు రైతులు మాత్రం వర్షాలతో సమకూరిన నీటితోనే ఇప్పటి వరకు సేద్యం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఎగువ కాకతీయ కాలువ కింద 24 వేల ఎకరాలు ఉండగా, దిగువ మానేరు పరిధిలో 76,033 ఎకరాల ఆయకట్టు ఉన్నది.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోకి మరో 15,065 ఎకరాల ఆయకట్టును పెంచారు. ఆయకట్టుకు నీళ్లు వదిలితే చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల కింద ఉన్న ఆయకట్టు పరిధిలో భూగర్భ జలాలు వృద్ధి చెంది పంటలకు సమృద్ధిగా నీరు లభించేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు గోదావరి నీరంతా వృథాగా పోతున్నా ఎల్ఎండీ రిజర్వాయర్‌కు ఎందుకు తరలించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మిడ్‌మానేరు నిండితేనే..
రైతుల డిమాండ్లు, బీఆర్ఎస్ నేతల ఒత్తిడితో ఎట్టకేలకు గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్‌హౌస్‌కు, అక్కడి నుంచి రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంప్‌హౌస్‌కు తరలిస్తున్న అధికారులు, శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయిస్తున్నారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. 27.55 టీఎంసీల సామర్థ్యమున్న మిడ్‌మానేరు మంగళవారం సాయంత్రం నాటికి 13.676 టీఎంసీలకు చేరుకున్నది.
ఇదే రోజు అన్నపూర్ణ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయడం ప్రారంభించారు. కానీ, ఎల్ఎండీకి మాత్రం ఇప్పటి వరకు నీటిని తరలించే ప్రయత్నం చేయడం లేదు. మధ్యమానేరు పూర్తి స్థాయిలో నిండితేనే గేట్లు ఎత్తి మానేరు ద్వారా ఎల్ఎండీకి నీటిని తరలించే అవకాశముంటుంది. ప్రస్తుతం మధ్యమానేరుకు ఇదే ప్రకారం నీరు వచ్చి చేరడం, అన్నపూర్ణ సాగర్‌కు తరలించడం వల్ల నీరు ఎల్ఎండీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా నేరుగా నీటిని విడుదల చేయాలని దిగువ ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, కాకతీయ ఎగువ కాలువ పరిధిలోని ఆయకట్టుకు సుమారు 5 వేల క్యూసెక్కులు వదులుతున్నప్పటికీ కాలువ ద్వారా ఎల్ఎండీకి చుక్క నీరు రావడం లేదు. అధికారులు ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుని ఎల్ఎండీకి నేరుగా నీటిని తరలించాల్సిన అవసరమున్నది.