కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం లేదు. లైట్లు బిగించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పనిచేయకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు. 2.50 కోట్లు వెచ్చించినా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం తలకు మించిన భారంగా మారుతున్నది. పెరిగిన వాహనాల రద్దీతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడం లేదు. దీంతో పోలీసులకే కాదు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రాంనగర్, అక్టోబర్ 23 : స్మార్ట్‌సిటీ ద్వారా వచ్చే నిధులతో నగరాన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాలని భావించి కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా నగర సుందరీకరణతోపాటు ప్రజల భద్రత కూడా ముఖ్యమని భావించి ప్రధాన చౌరస్తాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ, ప్రధాన రహదారుల వెంట అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. స్మార్ట్‌సిటీ నిధులతో సిగ్నలింగ్ కమాండ్ కంట్రోల్‌ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి పోలీస్ శాఖకు అప్పగిస్తామని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆచరణలో పెట్టింది. అంతవరకు బాగానే ఉన్నా స్మార్ట్‌సిటీ కింద వచ్చే నిధులతో కమాండ్ కంట్రోల్, సిగ్నలింగ్ వ్యవస్థను మరో సంస్థకు మున్సిపల్ కార్పొరేషన్ అప్పగించింది. సదరు సంస్థ ప్రధాన రహదారుల వెంట సీసీ కెమెరాలు, ప్రధాన కూడళ్లలో సిగ్నలింగ్ లైట్లను ఏర్పాటు చేసింది. అయితే, అంతా పూర్తయ్యాక పోలీస్ శాఖకు అప్పగించడంలో మాత్రం నిర్లక్ష్యం చూపింది. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన పనులకు బిల్లులు రాలేదని సీసీ కెమెరాలు, సిగ్నలింగ్ పర్యవేక్షణలో పూర్తి స్థాయి లోపాలు సరిదిద్దకుండానే ముఖం చాటేసింది.
ఫలితంగా నగరంలోని 26 చోట్ల ఏర్పాటు చేసిన సిగ్నల్ లైట్లు ఎప్పుడు పని చేస్తాయో? ఎక్కడ పని చేస్తాయో? అర్థంకాని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన సిగ్నల్, సీసీ కెమెరాలు పోలీస్ శాఖకు ఇంకా అందుబాటులోకి రావడం లేదు. పెరిగిన నగర జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు అదనంగా మరో స్టేషన్ ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు సిద్ధమవుతుండగా.. సంబంధిత సంస్థ మాత్రం సిగ్నల్ వ్యవస్థను మాత్రం పోలీస్ శాఖకు అప్పగించలేదు. దీంతో పోలీసులకు ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం తలకుమించిన భారం అవుతున్నట్టు తెలుస్తున్నది. ఒకప్పటికి ఇప్పటికి నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఏ రోడ్డు చూసినా ఫుల్ బిజీగా కనిపిస్తున్నది. ప్రధానంగా పండగ సమయాలు, ప్రత్యేక సందర్భాల్లో నగరం పద్మవ్యూహంలా మారుతున్నది. ఈ పరిస్థితుల్లో వాహనాలను అదుపు చేయడం సవాల్‌గా మారుతున్నది. ఇటు అడ్డదిడ్డమైన ట్రాఫిక్‌తో వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే అంతే తొందరగా ట్రాఫిక్ సమస్య క్లియర్ అవుతుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.
స్మార్ట్‌సిటీ కింద చేపట్టిన సిగ్నలింగ్ వ్యవస్థ పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. కాంట్రాక్టు నిర్వహిస్తున్న సంస్థతో ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షిస్తున్నాం. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా సిగ్నలింగ్ వ్యవస్థను ఆపరేట్ చేసేందుకు సెన్సార్ పద్ధతిని ఉపయోగించనున్నాం. అందువల్లే కొంత జాప్యం జరుగుతున్నది. నిధుల కొరతేమీ లేదు.