వాహనదారులూ జర జాగ్రత్త! ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే! భారీ జరిమానా పడబోతున్నది. స్టార్మ్ సిటీ కింద 2కోట్లతో నగరంలోని 28 ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలతో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను నగరపాలకసంస్థ పటిష్టం చేస్తున్నది. ఈ నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసి పోలీసుశాఖకు అప్పగించనుండగా, కొత్త యేడాది నుంచే నిఘా కట్టుదిట్టంకానున్నది. గీత దాటితే చాలు నిఘా నేత్రాలు తీసిన ఫొటోల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే ఆటోమేటిక్‌గా వాత పడబోతున్నది. రాంగ్‌రూట్, సిగ్నల్ జంపింగ్‌కు వెయ్యి చొప్పున, హెల్మెట్ లేకపోతే వంద ఫైన్ జనరేట్ కాబోతుండగా, అప్రమత్తం కావాల్సి ఉన్నది.
కరీంనగర్ రాంనగర్, డిసెంబర్ 24: కరీం‘నగరం’లో ట్రాఫిక్ ఆంక్షలు మరింత కఠినతరం కానున్నాయి. కొత్త ఏడాది నుంచి గీత దాటితే చాలు వాహనదారుల జేబుకు చిల్లులు పడబోతున్నాయి. స్మార్ట్ సిటీ కింద నగరపాలక సంస్థ 2కోట్లతో 28 చోట్ల అత్యాధునిక కెమెరాలతో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నది. మెట్రోపాలిటన్ సిటీ తరహాలో కెమెరాలను నగరంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడంతోపాటు ఆటోమేటిక్ చిప్ సిస్టంతో పనిచేసేలా అమర్చుతున్నది.
ట్రాఫిక్ అనుగుణంగా ఎప్పటికప్పుడు దానికదే టైమింగ్ సెట్ చేసుకొని పనిచేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సిగ్నల్ జంక్షన్ల వద్ద మారింగ్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసే పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ట్రయల్స్ కూడా చేశారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగానే పోలీస్ శాఖకు అప్పగించనుండగా, ఆ తర్వాతే గీత దాటిన వారిపై వాత పడనున్నది.
ట్రాఫిక్ సిగ్నల్ జంక్షన్ల వద్ద మారింగ్ దాటితే ఎవరూ చూడడం లేదని అనుకోవద్దు. మునుపటిలా ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిల్చోని ఫొటోలు తీయడం లేదని భావించొద్దు. ఎవరితో పనిలేకుండా సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు ఎప్పటికప్పుడు వాహనాల ఫొటో తీసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపనుండగా, నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఆటోమేటిక్‌గా చలానా జనరేట్ అవుతుంది. సిగ్నల్ జంపింగ్‌తోపాటు మార్ లైన్ దాటిన వారికి వెయ్యి, రాంగ్‌రూట్ వెయ్యి, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారుడికి వంద చొప్పున జరిమానా పడనున్నది.