రాంనగర్, డిసెంబర్ 9 / కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ ; కరీంనగర్ టవర్ పరిధిలో వ్యాపారాలు నిత్యం కిటకిటలాడుతాయి. మార్కెట్ ఏరియా, అన్నపూర్ణ కాంప్లెక్సు, ప్రకాశంగంజ్, శాస్త్రిరోడ్, తిలక్‌రోడ్, రాజీవ్చౌక్తోపాటు పలు ఏరియాలు నగరంలోనే అత్యంత బిజీగా ఉంటాయి.
కానీ, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ కరువైంది. దీంతో పలు షాపుల యజమానులు, తమ దుకాణాల ఎదుట రెండు మీటర్ల వరకు ఆక్రమణ చేసి.. సామగ్రి నింపుతున్నారు. మరికొంత మంది తమ తమ షాపుల ఎదుట రోడ్డుపైనే మరో చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ.. వారి నుంచి నెలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేలు వసూలు చేస్తూ ట్రాఫిక్ చిక్కులు తెచ్చి పెడుతున్నారు. ఫలితంగా రాకపోకలకు ఇబ్బంది అవుతున్నది. ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ట్రాఫిక్ పోలీసులు వెళ్లి క్లియర్ చేస్తున్నా.. ఆ తర్వాత రెండు రోజులకే మళ్లీ యధాస్థితికి చేరుకుంటున్నది. రోడ్లన్నీ వివిధ వ్యాపారవర్గాల ఆక్రమణలతో నిండిపోతుండగా, పార్కింగ్ అస్తవ్యస్తంగా మారి సమస్య మరింత తీవ్రమవుతున్నది. దీనికి అడ్డుకట్టవేయాలని ఇదే ప్రాంతం నుంచి పలువురు యజమానులు ట్రాఫిక్ పోలీసులకు చెబుతున్నా.. ప్రజల నుంచి అసహనం వ్యక్తమవుతున్నా అది మూణ్ణాళ్ల ముచ్చటే అవుతున్నది. సమస్య ఎంత తీవ్రంగా వేధిస్తున్నదో చెప్పడానికి నిదర్శనమే ‘నమస్తే తెలంగాణ’ తన కెమెరాలో బంధించిన ఈ చిత్రాలు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం
మార్కెట్ ఏరియా, గంజ్, క్లాక్ టవర్ లాంటి వ్యాపార సముదాయాల్లో ఒకప్పుడు విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉండేది. ఇప్పుడు కాస్త తగ్గింది. ఇంకా తగ్గించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. రోడ్లపైకి ఆక్రమణ లు చేస్తుండడంతోనే ఈ సమస్య వస్తున్నట్టు గుర్తించాం. ఆక్రమణలు తొలగింపు కోసం వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. వారు సహకరించకపోతే జరిమానాలు కూడా విధిస్తాం. అప్పుడు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఫుట్‌పాత్ వ్యాపారులకు కూడా మార్కింగ్ చేశాం. కూరగాయల మా ర్కెట్ తరలించే దాకా కొంత ఇబ్బందులు తప్పవు. దీనిపై మున్సిపల్ అధికారులతో పలుసార్లు చర్చించాం.
– ఎండీ సర్వర్, ట్రాఫిక్ ఏసీపీ (కరీంనగర్)