ODELA | ఓదెల, ఆగస్టు 23 : ఓదెల మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉండాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేయించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న ఆర్టీసీ బస్సు సౌకర్యం మాత్రం కల్పించడం లేదు. దీంతో ఓదెల మండల కేంద్రం ప్రజలతోపాటు పలు గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి సుల్తానాబాద్ మీదుగా తిరిగి పోవాల్సి వస్తుంది.
దీంతో సమయం కూడా ఎక్కువ కావడంతోపాటు బస్సు చార్జీలు కూడా భారం అవుతున్నాయి. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నేరుగా వెళ్లాలనే మంచి ఆలోచనతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. అయితే జిల్లా కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓదెల నుంచి పెద్దపల్లి కి ఉదయం, సాయంత్రం వేళలలో బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు వెళ్తున్న విద్యార్థులు, జిల్లా కార్యాలయాలకు, వైద్య సేవలకు, ఇతరత్రా పనులకు వెళ్లేవారు నేరుగా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓదెల-పెద్దపల్లి బస్సుతోపాటు జమ్మికుంట నుంచి పెద్దపల్లి, గోదావరిఖని వరకు ఓదెల, కొలనూర్, కొత్తపల్లి ల మీదుగా బస్సులను వేయాలని ఆర్టీసీ అధికారులను మండల ప్రజలు కోరుతున్నారు.