
Kaleshwaram lift irrigation projects | పెద్దపల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ)/జగిత్యాల, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ)/ధర్మారం/వెల్గటూరు : ‘కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కాళేశ్వరం గుడి కాదు.. లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి చెందిన రెండు పియర్లు కాదు.. ఒక బళార్ధక సాధక ప్రాజెక్టు పేరు కాళేశ్వరం.. ఆ కాళేశ్వరంలో అంతర్భాగమే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, నంది మేడారం నందీ పంపులు, నందీ రిజర్వాయర్, రాంపూర్ పంపులు, మిడ్ మానేరు గ్రావిటీ కెనాళ్లు, అండర్ టన్నెళ్లు, వందలాది పంపుల ఎత్తిపోతలు, వందలాది విద్యుత్ సబ్ స్టేషన్లు, వేలాది కిలో మీటర్ల కెనాళ్లు.. ఇవన్నిటి సంగమమే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 94వేల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. అంతే కానీ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు చెబుతున్నట్లు మేడిగడ్డలో కుంగిన రెండు పియర్లు కాదు..’అని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం తేట తెల్లం చేసింది.
ఆదివారం జగిత్యాల జిల్లా కోటి లింగాల, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంపు హౌజ్‌లోని డెలివరీ సిస్టర్న్‌ను మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, టీ. జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెలేలు దాసరి మనోహర్‌రెడ్డి, సుంకే రవిశంకర్, మాజీ జడ్పీ చైర్పర్సన్లు తులా ఉమ, దావ వసంతతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండగానే తెలంగాణ అంతటికీ సాగు నీరు త్రాగు నీరు రాదని, ఆ నీళ్లు వినియోగించుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పంపులు ఎత్తిపోయాలి, రిజర్వాయర్లు ఒడిసి పట్టాలి, పంపులు ఎత్తి మిడ్ మానేరును నింపాలి అలా తెలంగాణ అంతటికీ కాళేశ్వరంలో అంతర్భాగమైన సొరంగ మార్గాలు, అండర్ టన్నెళ్లు, గ్రావిటీ కెనాళ్ల ద్వారా తెలంగాణ అంతటికీ సాగు త్రాగు నీరు అందుతుందని కాంగ్రెస్ చెబుతున్న మేడిగడ్డ రెండు పియర్లు కేవలం 500ల కోట్లు కూడా కాదని తేట తెల్లం చేసింది.
ఇవిగో నంది డెలివరీ సిస్టర్న్‌లో కాళేశ్వరం ఎత్తిపోతలు : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తలపెట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండేదని, గేట్లు పెడితే రాయపట్నం వంతెనను నిర్మించాల్సి వస్తుందని, ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందని కనీసం ఆ ప్రాజెక్టుకు గేట్లు కూడా బిగించలేదని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో ఆ సమయంలో కేవలం ఆరోజు 35లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చాయని.. వరి పంట 68లక్షలే ఎందుకు పండిందని..? కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత కోటి 60లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా వచ్చాయని, రెండు కోట్ల 68లక్షల పంట ఎట్ల పండిందో జవాబు చెప్పాలన్నారు. మీరు కట్టిన ఎల్లంపల్లి నుంచే నీళ్లు పారితే.. ఎల్లంపల్లి నుంచే రాష్ట్రం అంతా 240టీఎంసీల నీళ్లు వచ్చేటట్టు ఉంటే.. ఆరోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు నిర్మాణానికి ఎందుకు ప్రతిపాధన చేశారో చెప్పాలన్నారు. ఎల్లంపల్లే సరిపోతది కదా.. మరి మీరు ఇప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ కట్టి తీరుతం అని ఎందుకు అంటున్నారో ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపాధనలకే పరిమితం అయ్యారు.
కనీసం అక్కడ తట్టెడు మట్టి కూడా తీయలే.. కబుర్లతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక్క మేడిగడ్డ కాదు.. ఒక బ్యారేజీ కాదు.. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజీల నిర్మాణం, అనేక రిజర్వాయర్ల నిర్మాణం, వేల కిలో మీటర్లు గ్రావిటీ కెనాల్స్, అండర్ టన్నెల్స్, పంపు హౌజ్‌లని మా నాయకులు హరీష్‌రావు, కేటీఆర్ ఇవన్నీ చెప్పీ చెప్పీ ప్రజలకు అర్థం అవుతున్నా.. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, నాయకులకు మాత్రం అర్థం కావడం లేదన్నారు. అర్ధమై నటిస్తున్నరా.. లేదా మరో మారు ప్రజలను మోసం చేద్దామనే కుట్ర పూరితం తప్ప ఇందులో ఏమీ లేదన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎలా మిడ్ మానేరుకు నీళ్లు పోతున్నాయో వివరించేందుకే ఈ యాత్ర చేపట్టామన్నారు.
ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నంది, రాంపూర్ పంపు హౌజ్‌లు రిజర్వాయర్ల ద్వారానే ఎత్తిపోతల ద్వారానే మిడ్‌మానేరుకు నీళ్లు పోతున్నాయన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని బీఆర్ఎస్ బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. ఇగో మీ కళ్ల ముందు కనబడుతున్న నీళ్లు ఎల్లంపల్లి నుంచి మోటార్లు ఆన్ చేయకుండానే ఇక్కడికి వచ్చినవా.. ఈ మోటార్లు కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్-2లోనివి కాదా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు, నంది పంపు హౌజ్ ఈ నిర్మాణం అంతా కాళేశ్వరంలో భాగమే. ఈ కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తేనే నంది డెలివరీ సిస్టర్న్ ద్వారా నంది రిజర్వాయర్ నిండుతది.. నందీ రిజర్వాయర్ నిండితేనే గాయత్రీ పంపు హౌజ్‌కు నీళ్లు పోతాయి. ఈ కనీస అవగాహణ లేకుండా.. ఇవన్నీ ఏం తెలియకుండా గాలికి మాట్లాడుతున్నారు మంత్రులు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నట్లుగా గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లుంటేనే రాష్ట్ర మంతా నీళ్లు పారుతాయనుకుంటే.. తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లెందుకు లేవో మంత్రి అడ్లూరి సమాధానం చెప్పాలన్నారు.
గోదావరి జలాలను తెలంగాణ బీళ్లకు మల్లించింది కేసీఆర్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
గోదావరి జలాలను రైతులకు అందించి సస్యశ్యామలం చేసింది కేసీఆర్ అన్నారు. తెలంగాణ సాగు, తాగు నీటి కష్టాలు లేకుండా ముందుచూపుతో కరువు అనే మాటే లేకుండా కాళేశ్వరం నిర్మించారన్నారు. నది జలాలను ఎలా వాడుకోవాలో తెలిసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని దిగువకు వెళ్ళే నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎగువకు పారెలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. శ్రీరాంసాగర్ వరద నీరు కాలువల ద్వారా, గ్రావిటీ ద్వారా కిందకు వెళ్తాయి. ఎల్లంపల్లి నుండి పంప్ హౌజ్‌ల ద్వారా నీటిని ఎగువకు తరలించే ఆలోచన చేసింది కేసీఆర్ అన్నారు. ఎల్లంపల్లి నుంచే నీళ్ళు ఇస్తున్నామని అంటున్న కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదని వారు విమర్శించారు. కన్నెపల్లి వద్ద కాపర్ డ్యాం ఎందుకు నిర్మాణం చేయడం లేదని, దేవుడు కరుణిస్తే ఈ నీళ్లు వచ్చాయి లేకుంటే కాంగ్రెస్ నాయకులు ఏం చేసేవారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఈ మూరపు ఆలోచనలు మానుకోవాలన్నారు. కరువులో ఆదుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు అని, అంతా అయిపోయాక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ సందర్శనలు చేయడం ఏమిటో అర్ధం కావడలం లేదన్నారు.
భగవంతుడు కరుణించి వర్షాలు పడితే కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. ఒకవైపు వాళ్ల ముఖ్యమంత్రికి అవగాహణ లేదు నీళ్లపైన.. మరో వైపు వాళ్ల మంత్రులకు అవగాహణ లేదు. ముఖ్యమంత్రి స్వయంగా దేవాదుల ఏ బేసిన్ కింద ఉన్నదో తెలియదు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రి అయ్యాక నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయనే కనీస అవగాహణ లేకుండా మాట్లాడుతున్నాడు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళుతున్నాయంటున్నాడు. నీళ్లపై వాళ్లకు అవగాహణ కల్పించేందుకే ఈ రోజు ఈ యాత్ర పెట్టుకోవడం జరిగిందన్నారు. మాజీ ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి నీళ్ల గురించి కాళేశ్వరం జలాల గురించి ఏబీసీలు కూడా తెలియదని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే వాళ్లు కాళేశ్వరం గుడి అనుకుంటున్నారన్నారు.
కాళేశ్వరం అనేది దేశంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు. చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహణ లేదు. ఆయనకే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కూడా అవగాహణ లేదన్నారు. నీళ్లపైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్న కనీస అవగాహణ ఈ కాంగ్రెస్ మంత్రులకు లేదన్నారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా పోతది అంటున్నారు. ఇక్కడ నంది డెలివరీ సిస్టర్న్‌కు ఇక్కడ పంపులు ఆన్ చేయకుండానే వస్తున్నాయా..? అని ప్రశ్నించారు. ఈ గుట్టళ్లల్లో నుంచి ఉబికి వస్తున్నాయా..? ఎల్లంపల్లి నుంచి ఈ నంది మేడార్ డెలివరీ సిస్టర్న్‌కు 100మీటర్ల ఎత్తుకు వచ్చి ఇక్కడ పోస్తున్నాయన్నారు. దాదాపుగా ఇక్కడికే 200ల అంతస్థుల భవనంపై ఎత్తునుంచి పోస్తున్నాయన్నారు.
కాళేశ్వరంతో కరువును దూరం చేసింది కేసీఆర్.. :ఎమ్మెల్సీ ఎల్. రమణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కరువు ప్రాంతంగా ఎండిన చెరువులు, కుంటలతో కనిపించేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. కాళేశ్వరంపై ఎన్ని కుట్రలు చేసినా ప్రజలకు వాస్తవాలు కనిపిస్తున్నాయన్నారు. నంది పంప్ హౌజ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా.. ఈ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనివి కాదా..? అని ప్రశ్నించారు. కళ్లున్న కబోదుల్లారా ఈ దృశ్యాలను చూసైనా అవగాహణ పెంచుకోవాలన్నారు. కాళేశ్వరంపై కక్ష గట్టి, కేసీఆర్‌పై కోపంతో ఈ పంపులు ఆన్ చేయకుండా ఇన్ని రోజులు ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. ఇప్పుడు తప్పక పంపులు ఆన్ చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందన్నారు. ఎప్పుడూ కరువు ప్రాంతంగా ఉంటుండే.. సీఎంగా కేసీఆర్ గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారన్నారు. ప్యాకేజీ 6 పంపులు ఎత్తిపోస్తున్న నీరే సజీవ సాక్ష్యమని, తెలంగాణ ప్రాంతానికి సాగు తాగు నీరు ఇచ్చేది ఇలాగే అన్నారు. ఇదే సజీవ సాక్ష్యమని అగో ఎల్లంపల్లి నుంచి నీళ్లను ఇక్కడ ఎత్తిపోస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టులోని నందిమేడారం పంపులే అన్నారు. ఇక్కడ ఒక నది ప్రవాహం ఎలా వస్తున్నదో ప్రజలకు తెలుసు అన్నారు. ఈ ప్రాజెక్టును కాపాడుకొని సుస్థిరమైన ఆయకట్టు, త్రాగునీటి కోసం కృషి చేస్తామన్నారు. ఏపరిస్థితులోనైనా ప్రజల ప్రయోజనాలను కాపాడుకుంటామని, గోదావరి జలాలను ఒడిసి పట్టి ఈ నంది పంపులతో నంది మేడారం రిజర్వాయర్‌ను నింపుకొని రాంపూర్ పంపులతో మిడ్ మానేరును నింపు కుంటున్నామన్నారు.