కరీంనగర్ కలెక్టరేట్/ తిమ్మాపూర్/ గంగాధర, జూలై 11 : ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మరోసారి సర్వర్డౌన్ అయింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. స్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారులు తమపేర పట్టా చేసుకునేందుకు విక్రయదారులతో కలిసి రాగా, సర్వర్ సమస్య తలెత్తింది. దీంతో క్రయ, విక్రయదారులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా వేచి చూడాల్సి వచ్చింది.
సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందా..? అధికారులు ఎప్పుడు తమ పేర్లు పిలుస్తారా..? అని స్లాట్ బుక్ చేసుకున్న వారంతా కార్యాలయాల నుంచి కదలకుండా ఉండిపోయారు. మధ్యాహ్న భోజనం సైతం చేయకుండా వేచి చూశారు. కార్యాలయ పనివేళలు ఇంకా కొద్దిసేపే ఉండగా, ఇక సర్వర్ సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి లేక నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య తలెత్తగా, దీనిని పరిష్కరించడంలో హైదరాబాద్ స్థాయిలో ఇబ్బందులు ఎదురైనట్టు జిల్లా అధికారులు పేర్కొన్నారు.
సర్వర్లో నెలకొన్న సాంకేతిక ఇబ్బందులతో ఈకేవైసీ ఆధార్ లింకప్ కాకపోవడం, క్రయ, విక్రయదారులు, సాక్షుల ఫొటోలు కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే అవకాశాలు లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్టు తెలిపారు. కాగా, తరచుగా జరుగుతున్న అంతరాయంతో రిజిస్ట్రేషన్దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని క్రయ, విక్రయదారులు ఆవేదన చెందారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్య ఎదురైతే, గంటల వ్యవధిలోనే సరిచేసి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించేవారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
మానకొండూర్, జూలై 11 : మరోవైపు తహసీల్ ఆఫీసుల్లోనూ సర్వర్ డౌన్ కావడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన తర్వాత తీరా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో పొద్దంతా పడిగాపులుగాశారు. బుధవారం ఎండ దంచి కొట్టగా ఇబ్బంది పడ్డారు. మానకొండూర్లోని తహసీల్దార్ అండ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద సాయంత్రం వరకు దాదాపు 6 గంటల వరకు చెట్ల కింద చేదతీరారు. సర్వర్లో సమస్య తలెత్తడంతోనే రిజిస్ట్రేషన్లు కావడం లేదని అధికారులు తెలియజేశారు.