Preventive Arrest | జగిత్యాల : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రతీ రాజకీయ పార్టీకి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. అలాంటి హక్కులను అడ్డుకునే విధంగా మంత్రి పర్యటన పేరుతో బీఆర్ఎస్ నాయకులను ప్రివెంటీవ్ కస్టడీలోకి తీసుకోవడం తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు.
ప్రశ్నించే గొంతులను ప్రివెంటివ్ కస్టడీలతో అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించడం సరికాదని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడకుండా అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం తన అసహన వైఖరిని బయటపెట్టిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని, పోలీసు చర్యలతో ప్రజల గొంతును అణచివేయలేరని, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.