Sanugula | చందుర్తి, ఆగస్టు 18 : చందుర్తి మండలం సనుగుల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బొడిగె లావణ్య కు ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె భర్త అనిల్ కూర్చుని అధికారం చెలాయిస్తున్నారని గ్రామానికి చెందిన మోకినపల్లి సురేష్ అనే యువకుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో అధికారులు మాట్లాడుతూ మహిళలు గెలుపొందిన పంచాయితీల్లో వాళ్లే సర్పంచ్ స్థానాల్లో కూర్చోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారి భర్తలకు పెత్తనం ఇవ్వద్దని పంచాయతీ కార్యదర్శులకు స్పష్టంగా చెప్పారు. అయితే అధికారుల ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా సర్పంచ్ భర్త అనిల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వివరించడమే గాక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమాల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకొచ్చి వేదికలపై సన్మానాలు, ఫొటోలు దిగుతూ పాఠశాల వాతావరణాన్ని ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న సర్పంచ్ భర్త అనిల్ పై, సహకరిస్తున్న పంచాయతీ కార్యదర్శి కన్నం అనిల్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆధారాలతో కూడిన వీడియో, ఫొటోలతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు యువకుడు సురేష్ తెలిపారు. కాగా ఇటీవల సర్పంచులుగా ఎన్నికైన మహిళ ప్రజాప్రతినిధుల పేర్ల చివరన భర్త పేర్లను నేమ్ బోర్డులో చేర్చడంతోపాటు అధికారులపై ఒత్తిడి తెచ్చి అధికారిక కార్యకలాపాలతో పాటు సన్మానాలు, సత్కారాలు పొందుతూ పంచాయతీరాజ్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.