కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 6: అక్రమ లే అవుట్ల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంకు కాసుల పంట పండుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో విశేష స్పందన వస్తున్నది. మొదట 25శాతం రాయితీ గత నెల 31 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశమిచ్చినా.. తాజాగా ఆ గడువును ఈ నెల 30వరకు పొడిగించింది. దీంతో రోజురోజుకూ ఆదాయం దండిగా వస్తున్నది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో ఎల్ఆర్ఎస్తో ఇప్పటివరకు 92కోట్ల సమకూరాయి.
ఈ ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాలోనే జమవుతుందని అధికారవర్గాల ద్వారా తెలుస్తుండగా, ఇదేం తీరు అని పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బులు ఆయా బల్దియా ఖాతాల్లో జమైతే పట్టణాల అభివృద్ధికి మేలు జరుగుతుంది. దశ మారుతుంది. గతంలో ఎల్ఆర్ఎస్ నిధులన్నీ మున్సిపాలిటీలకే చెం దేవి.
ఏయే డివిజన్లు, వార్డుల నుంచి నిధులు వచ్చా యో ఆయా డివిజన్లు, వార్డు లో 50 శాతం నిధులను అక్కడ అభివృద్ధికి వ్యయం చేయడంతోపాటు మిగిలిన 50 శాతం నిధులను ఆయా నగర, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించే వారు. కానీ, ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ఫీజులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే వెళ్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇవి తిరిగి మున్సిపాలిటీలకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది. దీంతో ఆయాచోట్ల పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తిరిగి మున్సిపాలిటీలకు ఎప్పుడు మంజూరు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
కరీంనగర్లోనే అత్యధికం
కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ పథకానికి 1.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో ఇప్పటి వరకు 28 వేలకు పైగా దరఖాస్తుదారులు ఫీజు చెల్లించగా, సుమారుగా 92కోట్ల ఆదాయం వచ్చింది. కరీంనగర్ నగరంలో 29,558 దరఖాస్తులు రాగా, 205 అర్జీలను అధికారులు తిరస్కరించారు. ఇప్పటివరకు 3,786 మంది ఫీజు చెల్లించగా, 22.54 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక జిల్లాలోని డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపాలిటీల్లో చూస్తే మొత్తం 48 వేల దరఖాస్తులు వచ్చాయి.
అందులో 9,826 మంది ఫీజు చెల్లించడంతో 39.27 కోట్ల ఆదాయం వచ్చింది. జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో 32 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 5,149 మంది ఫీజు చెల్లించగా, 14.85 కోట్లు వచ్చాయి. పెద్దపల్లి జిల్లాలో 19 వేలకు పైగా దరఖాస్తుదారుల్లో 5,247 మంది చెల్లించగా 20.25 కోట్లు, సిరిసిల్ల జిల్లాలో 36 వేలకు పైగా దరఖాస్తుదారుల్లో 7735 మంది చెల్లించగా 17.33 కోట్లు వచ్చాయి. వీటిని నిబంధనల మేరకు ఆయా మున్సిపాలిటీల్లో ఖాతాల్లో జమ చేస్తే పట్టణాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది.