రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝాను రోడ్డు భవనాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. 2013 బ్యాచ్‌కు చెందిన ఆమె అనేక పదవులు నిర్వర్తించారు. విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు. సహకార శాఖ డైరెక్టర్, రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఎఫ్ఏసీ)కు 2024 జనవరిలో విధులు నిర్వర్తించారు. వరంగల్ రూరల్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
కలెక్టర్ సందీప్కుమార్ఝాను ప్రభుత్వం బదిలీ చేయడంతో సిరిసిల్లలోని ఆయన బాధితులంతా శనివారం సంబురాలు జరుపుకొన్నారు. ఆయన బదిలీ వార్త వినగానే బాధితులంతా పటాకులు కాల్చి, ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టారు. స్వీట్లు పంచిపెట్టి సంతోషాన్ని వ్యక్తం చేశారు. రగుడు చౌరస్తాలోని కలెక్టరేట్ వద్ద పటాకులు కాలుస్తున్న బాధితులు శ్రీనివాస్, అగ్గి రాములు, అబ్బాడి అనిల్ మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు.
పటాకులు కాల్చవద్దంటూ నిలువరించారు. దీంతో రెచ్చిపోయిన బాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమపై అక్రమ కేసులు పెట్టి హింసించాడంటూ కడుపుకాలి పోతుందంటూ మండి పడ్డారు. ఆయన వెళ్లడం మాకెంతో సంతోషంగా ఉందని అందుకే పటాకులు కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. కలెక్టర్ బదిలీ కావడం ప్రజలు సంబురాలు జరుపుకోవడం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది.