Siricilla BRS | సిరిసిల్ల టౌన్, జూలై 18: పేద విద్యార్థుల ప్రాణాలంటే రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ విమర్శించారు. గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం తెలంగాణ చౌక్‌లో భైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాలు కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారని కొనియాడారు.
రేవంత్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి గురుకులాలకు వెళ్లాలంటేనే విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు వచ్చాయని వాపోయారు. ఉన్నత చదువుల కోసం ఎన్నో గురుకులాల్లో అడుగుపెట్టిన విద్యార్థుల ప్రాణాలకు మనుగడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ ఫాయిజన్ కేసులు సర్వసాధారమైపోయాయని అన్నారు. జిల్లా లక్ష్మీపూర్‌లో దాదాపు 40 మంది విద్యార్థులు ఫుడ్ ఫాయిజన్ భారీన పడ్డారని తెలిపారు.
ముఖ్యమంత్రి డిల్లీ పర్యటనలు మానుకుని విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. నెలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తారని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలలో ఎదురవుతున్న సమస్యలపై వెంటనే సమీక్ష నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులను విధుల నుండి తొలగించాలన్నారు. లేనిపక్షంలో కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, వడ్లూరి సాయి, సూర్య, ముద్దం అనిల్ గౌడ్, ఎస్కే అఫ్రోజ్, రాకేష్, రాజు, నరేష్, వేంకటేశం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.