MLA Dr Kalvakuntla Sanjay | కోరుట్ల,జూన్ 28: దేశ భవిష్యత్తు నవతరం, యువతరం చేతుల్లోనే ఉందని, ఆడవాళ్లు మగవాళ్లు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు తమ ప్రతిభను చాటుకొని ఉద్యోగాల్లో రాణించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణంలోని కట్కం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తెలంగాణలో యువతరం గళం ఎత్తితేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. కొత్త తరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించేలా ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందన్నారు. యువత తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని తమ స్కిల్స్ ను ఉపయోగించి దేశ పునర్నిర్మాణానికి అవసరమైన మేధోసంపత్తిని పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జాబ్ ప్రొఫైల్స్ రోజురోజుకు మారిపోతున్నాయని కృత్తిమ మేదస్సు ద్వారా సరికొత్త ప్రపంచం ఆవిష్కరణం కానుందని తెలిపారు. 30 ఏళ్ల క్రితం చైనా, ఇండియా స్థూల ఉత్పత్తిలో తలసరి ఆదాయంలో సరి సమానంగా ఉండేవన్నారు. కాలక్రమమైన చైనా అభివృద్ధి చెందిన దేశంగా వృద్ధి సాధించిందన్నారు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం గానే మిగిలిపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు విద్య ,వైజ్ఞానిక, ఉద్యోగ రంగాల్లో రాణించాలన్నారు. జాబ్ మేళాలో ఏ ఉద్యోగం సాధించిన జాయిన్ కావాలని, హైదరాబాదులో మహిళలకు ఏ అవసరం ఉన్న తనను సంప్రదించాలని సాయం అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తొలిమెట్టు నుంచే మలీ మెట్టుకు చేరుకుంటామని, ఉన్నత ఉద్యోగంలో స్థిరపడేందుకు ఉద్యోగ అనుభవం దోహదం చేస్తుందని తెలిపారు.
చిన్న ఉద్యోగమని చూడకుండా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి భారీ స్పందన వచ్చింది. నియోజకవర్గానికి చెందిన సుమారు 3000 మంది యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
75 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి కేటగిర్లవారీగా నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీలు జాబ్ మేళాలో పాలుపంచుకున్నాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చీటీ వెంకటరావు, దారిశెట్టి రాజేష్, ఫహీం, తోట నారాయణ, గుడ్ల మనోహర్, బట్టు సునీల్, తదితరులు పాల్గొన్నారు.