కమాన్చౌరస్తా, నవంబర్ 26: జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో శనివారం ‘ఫ్యూజ్ న్యూవైబ్స్, ద ఫెషర్స్ అపెక్స్’ వేడుకలు అలరించాయి. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ వీ రవీందర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా శాతవాహన యూనివర్సిటీ వీసీ సంకశాల మల్లేశ్ హాజరై మాట్లాడారు. మహిళా సాధికారత ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. కళాశాల స్థాయి నుంచి ఉద్యోగాల సాధనలో కూడా మహిళలకు ఉన్న రిజర్వేషన్లు వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రంగంలో మహిళల అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
కళాశాల కరెస్సాండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థినులు ఉన్నత విద్య, వారి ప్రతిభా పాటవాలను వెలికితీసేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గోలి శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.