Rasamai Balakishan | తిమ్మాపూర్, జనవరి 16: ఒకప్పుడు మానకొండూరు నియోజకవర్గం అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని. నేడు శని పట్టి కాంట్రవర్సీలకు అడ్డగా మారిందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి బుద్ధి మారడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తల గుండాయిజం ప్రజల వరకే కాకుండా ప్రజలకు సేవ చేసే అధికారుల వద్దకు చేరిందన్నారు.
మానకొండూర్ నియోజకవర్గం అనగానే అభివృద్ధి గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు ఇసుక దందా, కమీషన్లతో నియోజవర్గానికి చెడ్డ పేరు వస్తోందన్నారు.ఎప్పుడు ఏ వార్త వస్తుందోనని అధికారులు భయపడుతూ పని చేస్తున్నారు. కమీషన్లు, అక్రమాలకు అధికారులను కవ్వంపల్లి బలి చేస్తున్నాడన్నారు.
నీళ్లలో ఉన్న ఇసుకను తీసుకొని, రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నాడని తీవ్రంగా విమర్శించారు. ఇసుక ట్రాక్టర్లతో కుటుంబాలను పోషించుకుంటున్న మధ్య తరగతి కుటుంబాలపై ప్రతాపం చూపుతున్నాడాని ధ్వజమెత్తారు. ఊటూరులో ఇసుక క్వారీ నడుపుతూ, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యేనే స్వయంగా ఇసుకదందా చేస్తూ, మానకొండూర్ మండల ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాదన్నారు.
సీపీని కూడా వదలట్లే..
కరీంనగర్ సీపీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. ఆయన అక్రమాలకు ఎల్ఎండీ ఎస్సై బలయ్యాడన్నారు. ఎమ్మార్వో ఆఫీసుల పనికి షాడో ఎమ్మెల్యే అనుమతి ఎందుకని, ఎమ్మెల్యే చెప్పే దాకా పనులు జరిగే పరిస్థితి లేదని ఆరోపించారు. సీఎంతో ఫొటో దిగి సోషల్ మీడియాలో పెడుతూ ప్రచారానికి పీఏను వినియోగించుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. కవ్వంపల్లిని నమ్ముకుంటే కష్టాలే తప్ప, కార్యకర్తలు ఆయన మాటలు నమ్మి పైసలు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మరోసారి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
షాడో మీద గంత ప్రేమ..
షాడో ఎమ్మెల్యే మీద ఎన్ని వార్తలు వచ్చినా, ఆయన్ను దూరం పెట్టడం లేదని, అసలు ఎమ్మెల్యేకు ఆ షాడో ఎమ్మెల్యేకు సంబంధం ఏంటని రసమయి ప్రశ్నించారు. చాకలివని పల్లెలో చనిపోతే పిట్టకు పెట్టుకునే పరుపు బండను కూడా మాయం చేసిండని, బుడ్డ ఎమ్మెల్యే ఊర్లు, చెరువులు అమ్ముతున్నడని, ఇంకా మున్ముందు ఇంకేమి అమ్ముతడో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి తేలదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.