సుల్తానాబాద్, జూలై 31: ఆ ముగ్గురు యువకులు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈజీ మనీ కోసం రాంగ్ రూట్ ఎంచుకున్నారు. పందెం కోళ్లు, కోళ్లను ఎత్తుకెళ్లి అడ్డంగా దొరికిపోయారు. ఆ ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను సుల్తానాబాద్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ మేరకు సుల్తానాబాద్ ఠాణా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జీ కృష్ణ వివరాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకు చెందిన మేచర్ల ఏసుబాబు (33), గ్యార విష్ణు (26), మేచర్ల కిషోర్ (38) ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కారు. ఆంధ్ర, తెలంగాణలో పందెం కోళ్లను దొంగిలిస్తూ , వాటిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేసుకునే వారు. ఈ క్రమంలో వీరిపై పోలీసులు ఏడు చోరీ కేసులు నమోదు చేశారు.
జూలై 26న సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన చీటి సతీశ్రావుకు చెందిన 22 నాటు కోళ్లను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ నరేష్కుమార్ బృందం పోలీసులు రంగంలోకి దిగారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు.
దొంగలించిన కోళ్లను విక్రయించేందుకు బుధవారం ఉదయం స్విఫ్ట్ కారులో నిందితులు వెళ్తుండగా, సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 22 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు కృషిచేసిన ఎస్ఐ నరేశ్, ఏఎస్ఐ తిరుపతి, హెడ్‌కానిస్టేబుల్ సుధాకర్, తిరుపతినాయక్, రమేశ్, రాజ్‌కుమార్‌ను అభినందిస్తూ, రివార్డులను అందజేశారు.