Korutla | కోరుట్ల, జూలై 9: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ తీశారు.
ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ నూతనంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కార్మికుల శ్రమను కార్పోరెట్ శక్తులకు దోచి పెట్టేందుకే నూతన కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాచే నూతన చట్టాన్ని అంగీకరించబోమని పేర్కొన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయడంతో పాటు కనీస వేతనాల జీవోలను సవరించి కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం అందించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. అంగన్వాడి, ఆశ. మధ్యాహ్న భోజనం వర్కర్లను స్కీం వర్కర్లుగా గుర్తించాలన్నారు. సామాజిక భద్రతతో పాటూ పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పెన్షన్ వంటి సంక్షేమ పధకాలు అందించాలని పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ జీవాకర్ రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, బీడీ, హమాలీ, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.