Ramagiri | రామగిరి, మే 2 : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నిందితులు అధికార పార్టీకి చెందినవారు కావడంతో పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రమాదానికి బాధ్యులెవరో పోలీసులకు ముందే తెలిసినా, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు విషయాన్ని బయటపెట్టలేదని వారు ఆరోపించారు.
సాయితేజ మృతి చెంది 13 రోజులు గడిచినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం బాధాకరమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ వారిని రక్షిస్తున్నారని ఆరోపిస్తూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పోలీస్ అధికారుల వైఖరి పట్ల వారు పోలీస్ స్టేషన్ ముందు బైటాయించి నిరసన తెలపడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలను వెలికితీసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం నిందితుల అరెస్ట్ వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.