Tender dispute | కోల్ సిటీ, సెప్టెంబర్ 18: రామగుండం నగర పాలక సంస్థలో గతంలో ఎప్పుడు లేనివిధంగా తాజాగా టెండర్ల గొడవ వీధికెక్కింది. మాజీ కార్పొరేటర్, కాంట్రాక్టర్ల పరస్పరణ ఆరోపణలు బల్దియాకు అపవాదు తెచ్చిపెడుతోంది. నగర పాలక సంస్థ పరిధిలో స్టాంప్ డ్యూటీ నిధులు రూ.13.13 కోట్ల నిధులతో 7 ప్యాకేజీల ద్వారా యూజీడీ పనులకు గానూ ఇటీవల టెండర్లు జరిగాయి.
ప్యాకేజీ-1 కింద రూ.197.50 లక్షలతో ఎన్టీపీసీ పరిధిలోని 1 నుంచి 5వ డివిజన్ వరకు పలు కాలనీల్లో యూజీడీ నిర్మాణాలకు టెండర్లు పిలవగా, ప్యాకేజీ 2 కింద మరో రూ.197.55 లక్షలతో గోదావరిఖనిలో 6 నుంచి 10వ డివిజన్ పరిధిలో యూజీడీ పనులు, మూడో ప్యాకేజీ కింద 15,17, 23 తదితర డివిజన్లలో రూ.197.65 లక్షలతో యూజీడీ పనులు, ప్యాకేజీ- 4 కింద 25, 26 డివిజన్లలో రూ.186.50 లక్షలతో యూజీడీ పనులకు, ప్యాకేజీ – 5 కింద 26,27, 28, 29, 30, 33 34. 35, 36,37 డివిజన్లలో రూ.193.75 లక్షలతో యూజీడీ, ప్యాకేజీ 6 కింద 38,39,42, 43 డివిజన్లలో రూ.181.75 లక్షలతో యూజీడీ, ప్యాకేజీ-7 కింద రూ. 159..00 లక్షలతో 44, 45, 47, 49, 50 డివిజన్లలో యూజీడీ పనులకు టెండర్లు పిలిచారు. ఈ పనులను స్థానిక సీనియర్ కాంట్రాక్టర్లు కలిసి దక్కించుకున్నారు.
ఐతే కరీంనగర్ చెందిన మరో కాంట్రాక్టర్ పేరు మీద కూడా పనులు పొందినట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి. దీనితో 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ టెండర్లలో అనుమానాలు ఉన్నాయనీ, సీడీఎంఏకు ఫిర్యాదు చేస్తామని బహిరంగ ప్రకటించారు. దీనితో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డెక్కి తాము ఎక్కడా రింగ్ కాలేదనీ, ఆన్లైన్ ద్వారా అంచనా వ్యయం కంటే తక్కువగా కోడ్ చేసి పనులను పొందామనీ, ఇందులో అధికార పార్టీకి సంబంధం లేదంటూ ఆవేశం ప్రదర్శించడం విస్మయం కలిగించింది.
ఆరోపణలు చేసిన మాజీ కార్పొరేటర్, ఆమె భర్తపై వ్యక్తిగత దూషణలకు దిగడం రాద్దాంతమైంది. ప్రెస్ క్లబ్ లో మీడియా విస్తుపోయేలా అసభ్య పదజాలాలను ప్రయోగించడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలతో అటు బల్దియా ఇంజనీరింగ్ అధికారులు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. గతంలో ఆరోపణలను లెక్కచేయని కాంట్రాక్టర్లు ఇప్పుడు రోడ్డెక్కి రచ్చ చేస్తుండటం అందరు విస్తుపోతున్నారు. పెండింగ్ పనులు ఉన్న కాంట్రాక్టర్లకు కొత్తగా ఇచ్చారా? రిజర్వేషన్ పద్ధతి పాటించారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇందులో ఏలాంటి చేతులు మారలేదనీ, స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించడం వల్లనే తమకు పనులు అప్పగించారని కాంట్రాక్టర్లు వాదిస్తున్నారు. పరస్పర ఆరోపణల అంశం వివాదస్పదంగా మారుతోంది.
కాగా, జూన్ 19న కాంట్రాక్టర్లతో సమావేశమైన కమిషనర్ అభివృద్ధి పనులకు అంచనా వ్యయంపై 25 శాతం కంటే మించి లెస్ టెండర్ వేస్తే థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ కు తోడు ఇంజనీరింగ్ అధికారులతో పరీక్షలు జరిపిన తర్వాతనే బిల్లు చెల్లించడం జరుగుతుందని, ఇకపై అగ్రిమెంట్లో ఈవిధానం పొందుపరుస్తామని ప్రకటించారు. కాగా, ఈఈ రామన్ ను వివరణ కోరగా, యూజీడీ పనులు ఆన్లైన్ టెండర్లు అనీ, టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేశారు. బయట జరిగే ఆరోపణలకు తమకు సంబంధం లేదనీ, నిబంధనల ప్రకారమే పనులను అప్పగిస్తామని తెలిపారు. ఎస్.ఈ ని వివరణ కోరగా, టెండర్ల గురించి తనకేం తెలియదని దాటవేయడం కొసమెరుపు.