సిరిసిల్ల రూరల్, మే 9: అజర్ బైజాన్ దేశంలోని ఓ కంపెనీలో ఉద్యోగాలున్నాయని చెప్పి, తీరా విజిట్ వీసాపై పంపి 23 మందిని మోసం చేసిన నిజామాబాద్ జిల్లా బీంగల్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ సయ్యద్ అశ్వక్ సిరిసిల్ల పోలీసులకు చిక్కాడు. తంగళ్లపల్లి ఎస్ఐ రామ్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన పంజా వేణు 14 ఏండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఇటీవలే గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. మూడు నెలల క్రితం మళ్లీ గల్ఫ్ వెళ్లేందుకు ఢిల్లీలో ఓ ఇంటర్వ్యూకు వెళ్లాడు. అయితే అక్కడ వేణును సయ్యద్ అశ్వక్ కలిశాడు. యూరప్ దేశంలో అజర్ బైజాన్‌లోని కంపెనీలో సూపర్ వైజర్‌గా ప్రూట్స్ ప్యాకింగ్ చేసే పని ఉందని, నెలకు రూ.1.50లక్షల జీతం ఉంటుందని నమ్మించాడు. ప్యాకింగ్ చేసే ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయని, నెలకు రూ.లక్ష జీతం వస్తుందని, ఫ్యామిలీతోనూ అక్కడే సెటిల్ కావచ్చని చెప్పాడు. అశ్వక్ మాటలు వేణు నమ్మాడు.
తనతోపాటు మరో 22 మంది కలిసి రూ.80లక్షల వరకు అశ్వక్‌కు ముట్ట జెప్పాడు. కంపెనీ వీసా ఇస్తామని చెబుతూ వచ్చిన అశ్వక్, వారికి విజిట్ వీసాలు చేతిలో పెట్టాడు. అజర్ బైజాన్‌కు వెళ్లగానే కంపెనీ ప్రతినిధులు వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారని చెప్పి, పంపించాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఎవరూ రాకపోవడంతో హోటల్లో 15రోజుల పాటు ఉన్నారు. మోసపోయామని గుర్తించి ఆందోళన చెందారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి డబ్బులు తెప్పించుకుని, విమాన టికెట్స్ తీసుకోని తిరిగి వచ్చారు. అశ్వక్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేకపోవడంతో ఎస్పీని ఆశ్రయించారు. బాధితుడు పంజా వేణు ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి గురువారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో అశ్వక్‌ను పట్టుకుని తీసుకువచ్చారు. శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.