కరీంనగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్థానిక సంస్థల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్‌కు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం లేకుండా వెయ్యి మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్న అధికారులు, ఇదే సమయంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
విస్తృత ఏర్పాట్లు
రెండు స్థానాల ఎన్నికల కోసం పూర్వ కరీంనగర్ జిల్లాలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, మంథని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకటి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మరొక సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోలింగ్‌లో నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, మున్సిపాలిటీలలోని కౌన్సిలర్లు, పంచాయతీరాజ్ సంస్థల్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మొత్తం 1324 మంది ఓటు హకు కలిగి ఉండగా, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఏ ప్రజాప్రతినిధులు ఏ పోలింగ్ కేంద్రంలో ఓటువేయాలో ఇప్పటికే అధికారులు సమాచారం ఇచ్చారు. ఓటర్లలో నలుగురు నిరక్షరాస్యులు ఉండగా, వారు ఓటు వేసేందుకు వీలుగా అధికారులు సహాయకులను నియమించారు. ఓటింగ్ రెండు స్థానాలకు కలిపి ఒకే బ్యాలెట్ పేపర్ ఉంటుంది. ప్రతి ఓటరు ఒకటి నుంచి పది వరకు ఎవరికి ఇష్టమైన అభ్యర్థికి వారు ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్నుతోనే అంకెలు వేయాల్సి ఉంటుంది. లేదా ఒక ఓటరు ఒక ఓటైనా వేయవచ్చు. పదివేయాలన్న నిబంధన లేదు.
కట్టుదిట్టంగా బందోబస్తు.. పకడ్బందీగా కొవిడ్ నిబంధనలు..
అన్ని పోలింగ్ స్టేషన్లలో కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్లో శానిటైజర్లు, మాసులు, హెల్త్ వరర్లను నియమించారు. పోలింగ్ కేంద్రాల లోపలికి సెల్ ఫోన్లను అనుమతించరు. ఎన్నికలు పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అలాగే 1,113 మంది పోలీసులతో గట్టి బందోబస్తు చేపడుతున్నారు. ఎన్నికల నిర్వహణకు 8 రూట్లను గుర్తించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రానికి సామగ్రిని గురువారమే పంపించారు. సామగ్రి తీసుకువెళ్లే ప్రతి వాహనానికి ఎసార్టు కూడా ఏర్పాటు చేశారు.
సమర్థవంతంగా విధులు నిర్వహించాలి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
ఎన్నికల అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, ఎక్కడా ఏ ఇబ్బంది రావద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అధికారులతో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, పోలింగ్ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని, ఆ ప్రకారంగా విధులను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల దాకా జరిగే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి పోలింగ్ అధికారులు, ఓటర్లు సెల్ఫోన్లు తీసుకురావద్దన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉంటారని, ఓటర్లను గుర్తించిన తర్వాతనే ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరుకు సింగిల్ గ్లౌజ్ (చేతి తొడుగు) అందజేయాలని, ఓటు వేసిన తర్వాత చేతి తొడుగును డస్ట్‌బిన్‌లో వేసేలా చూడాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్త్ డెస్క్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అధికారులు బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని, మధ్యలో ఎక్కడా కూడా ఆగవద్దన్నారు. బ్యాలెట్ బాక్సులను కంపార్ట్మెంట్లో పెట్టవద్దని, పోలింగ్ అధికారులకు ఎదురుగా పెట్టాలని సూచించారు. పోలింగ్ ముగిశాక బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి బస్సులో బందోబస్తుతో నేరుగా కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలోని రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచాలని కలెక్టర్ ఆదేశించారు. ముందుగా ర్యాండమైజేషన్ చేసి పోలింగ్ అధికారులకు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. కాగా, సీజ్చేసిన బాక్సులను శుక్రవారం రాత్రి వరకు ఎస్సారార్ కళాశాలకు చేర్చుతారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఈనెల 14 కౌటింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు.