కోనరావుపేట, అక్టోబర్ 7 : చల్మెడ జానకీదేవి జ్ఞాపకార్థం న్యాయశాఖ మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు స్వగ్రామం మల్కపేటలో నిర్మించిన పాఠశాలను, సీతారామస్వామి ఆలయాన్ని సుప్రీంకోర్టు జడ్జి పులిగోరు వెంకట సంజయ్‌కుమార్ సోమవారం సందర్శించారు. ముందుగా గ్రామంలోని జానకీదేవి పాఠశాలలో తరగతి గదులను పరిశీలించి, మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజీ-9 బండ్-2 కట్టపై నిర్మించిన సీతారామస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు స్వామి ప్రసాదాన్ని అందజేసి, కండువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, విశాలమైన వాతావరణంలో బడి, గుడి నిర్మించడం అభినందనీయమన్నారు. అత్యంత అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారని కొనియాడారు. ఇక్కడ చల్మెడ మధుసూదన్‌రావు, అడ్వకేట్ రామారావు, శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరె లతామహేందర్ ఉన్నారు.