Peddapally | పెద్దపల్లి, అక్టోబర్10 : బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించటంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని జాతీయ బీసీ సంఘం కో -ఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలో ప్రజాసంఘాలు, ఉద్యమ సంస్థలు, కుల సంఘాలు, ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈనెల 14న రాష్ర్ట బంద్కు సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
బలహీనవర్గాల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజ్యాధికారం కోసం పోరాడుతున్న సంఘాలను ఏకతాటి మీదికి వచ్చి బంద్కు పిలుపునిచ్చాయన్నారు. బీసీల ఐక్యతను చాటుతూ బంద్ ద్వారా బీసీల సత్తా ఏంటో ప్రభుత్వానికి చాటాలన్నారు. బీసీలంటే ప్రభుత్వానికి చులకనగా ఉందా? ఒక చేతితో రిజర్వేషన్లు ఇచ్చి, మరో చేతితో రెడ్డి సంఘాలతో కేసులు వేయించి ఈ రాష్ర్ట ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అడ్డుకోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
బీసీల 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నోమురి శ్రీధర్ రావు, రాష్ర్ట నాయకుడు కోమటిపల్లి రాజేందర్ నేత, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బూర్ల థనుంజయ నేత, అమిరిశేట్టి సంజీవ్, రవికిరణ్ తదితరలు పాల్గొన్నారు.