వేములవాడ రూరల్, సెప్టెంబర్ 8 : వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన క్యాంపస్, కనీస మౌలిక వసతులు లేక అరిగోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాత కళాశాల ఎదుట రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అన్ని వసతులు ఉంటాయని చెప్పిన అధికారులు ఇప్పుడు వాటి గురించి పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
జేఎన్టీయూ కళాశాల అగ్రహారం డిగ్రీ కాలేజీలో తాత్కాలికంగా నడుస్తున్నదని, దాదాపు 1200 మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. అయితే విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఉన్న 8 తరగతి గదులు సరిపోవడం లేదని, అలాగే హాస్టల్ వసతి లేకపోవడంతో కిలోమీటర్ దూరం నుంచి కాలేజీకి నడిచి వస్తున్నామని వాపోయారు. ల్యాబ్‌ల కోసం కొండగట్టు జేఎన్టీయూకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. తమకు కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దాదాపు గంట పాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థుల పై పోలీసులు జులుం ప్రదర్శించారు. భయాందోళనకు గురిచేయడంతో పాటు దాదాపు 9 మంది విద్యార్థులను బలవంతంగా వేములవాడ పోలీస్‌స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపే కనీస హక్కు తమకు లేదా? అని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ జోక్యంతో కాలేజీకి వెళ్లిపోగా, రాస్తారోకో ముగిసిన తర్వాత పోలీసులు విద్యార్థులను విడిచిపెట్టారు. కాగా, పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇటు విద్యార్థులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్, జిల్లా ప్రెసిడెంట్ మానాల అర్జున్, మట్టెల సాయిదీపక్‌తో పాటు ఏబీవీపీ నాయకులు రంజిత్, రాజును అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాస్తారోకో అనంతరం వదిలిపెట్టారు.
విద్యార్థులకు చల్మెడ పరామర్శ
విద్యార్థులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గం ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పోలీస్ సేష్టన్‌కు వెళ్లారు. విద్యార్థలను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల దౌర్జన్యాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జేఎన్టీయూ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిషరించాలని డిమాండ్ చేశారు.