Dharmaram | ధర్మారం, ఆగస్టు 1 : దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని ఈ క్రమంలో విద్యార్థులు రాజ్యాంగ విలువలు, ప్రాథమిక విధులను తెలుసుకుని వాటిని జీవితంలో ఆచరించాలని నంది మేడారం జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కం జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత సూచించారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జడ్పీ హైస్కూల్లో శనివారం నిర్వహించిన లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి సరిత మాట్లాడుతూ విద్యార్థులు న్యాయపరమైన అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు.
భారత రాజ్యాంగం ప్రకారం అమలవుతున్న చట్టాల గురించి తెలుసుకోవాలని ఆమె సూచించారు .బాలల హక్కులు, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపులు (పోక్సో) చట్టంపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని తెలిపారు. ప్రస్తుతం యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి తీవ్రమైన ముప్పుగా మారుతోందని పేర్కొంటూ, విద్యార్థులు అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. తమ ఉజ్వలమైన భవిష్యత్తును మత్తుపదార్థాల నుంచి సంరక్షించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
అలాగే సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు ఇతరులతో పంచుకోవద్దని ఆమె సూచించారు. ఎలాంటి సైబర్ మోసాలకు గురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆమె తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత న్యాయ సహాయ సేవలను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్, నంది మేడారం అడ్వకేట్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆకారి రాజేశం,ట్రెజరర్ నూనె సత్యనారాయణ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ భీమారపు సంపత్, రావుల రజిత, బల్ల సరిత, సీనియర్ న్యాయవాది ఆల్క వినోద్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే వసంత,ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.