విద్యానగర్, జూన్ 23: నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రణానికి దిగింది. పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నా నోరు మెదపని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నించింది. బండికి కేంద్రమంత్రిగా కొనసాగే నైతిక హకు లేదని డిమాండ్ చేసింది. నీట్ యూజీ, యూజీసీ నెట్ పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా నుంచి ర్యాలీగా నగరంలోని బండి సంజయ్ క్యాంపు ఆఫీస్ వద్దకు చేరుకొని ముట్టడికి యత్నించారు.
పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజినీకాంత్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ, డీవైఎఫ్ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకుడు మాట్లాడుతూ బండి సంజయ్‌కి మత రాజకీయాలపై ఉన్న శ్రద్ధ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌పై లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉద్యమం చేస్తుంటే ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీకి దేశాన్ని పరిపాలించే హకు లేదని, పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని వారు దేశాన్ని ఏం పాలిస్తారని దుయ్యబట్టారు.
నీట్ మళ్లీ నిర్వహించేదాకా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఇక్కడ ఎన్ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలసాని లెనిన్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామారావు వెంకటేశ్, మచ్చ రమేష్, అరవింద్, గజ్జల శ్రీకాంత్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు రాణా ప్రతాప్, అంగడి కుమార్ డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేశ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు రేణికుంట్ల ప్రితం, మళ్లారపు ప్రశాంత్, గంతులు మహేష్, రోహిత్, సనత్ రెడ్డి, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.