PEDDAPALLY | పెద్దపల్లి మే 05(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన ఆర్వోఆర్ చట్టం పై సుల్తానాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ధరణి చట్టం, భూ భారతి చట్టం మధ్య వ్యత్యాసాలను స్పష్టంగా రైతులకు వివరించామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపెల్లి జిల్లాలో మే ఐదు నుంచి మే 19 వరకు వెలిగేడు మండలంలోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ భారతి చట్టం క్రింద భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, రెవెన్యూ సదస్సులలో వచ్చే దరఖాస్తులను పూర్తిస్థాయిలో జూన్ 2 వరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
కోర్టు కేసుల సమస్యలు, కుటుంబ వివాదాల సమస్యలు మినహాయించి మిగిలిన అన్ని రకాల సమస్యలను భూ భారతి చట్టం వినియోగించి పరిష్కరిస్తామని అన్నారు. ప్రతీరోజు రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో సమగ్ర రికార్డు నిర్వహిస్తున్నామని, ఆర్ఎస్ఆర్, అసైన్మెంట్ సమస్యలు, సాధా బైనామా దరఖాస్తులు, పార్-బీ సమస్యలు, ఇతర వివిధ రకాల భూ సమస్యలను భూ భారతి చట్టం ద్వారా పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద మన జిల్లాలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ మొత్తం కలిపి సుమారు 47 వేల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ప్రభుత్వం కొంత మేర సబ్సిడీ, బ్యాంకు బ్యాంకు లింకేజీ కలిపి యువ వికాసం యూనిట్ గ్రౌండ్ చేయాల్సి ఉంటుందని, ఎన్పీఏ ఉన్న దరఖాస్తుదారులు, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న దరఖాస్తుదారులను, గత ఐదు సంవత్సరాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి యూనిట్ల పోందిన దరఖాస్తులను ముందుగా మినహాయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రాంతాలలో అధికంగా దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా దరఖాస్తుల ధ్రువీకరణ పూర్తి చేస్తామని, రాష్ట్రం నుంచి జిల్లాకు యువ వికాసం నిధుల కేటాయింపు జరగగానే మండలాల వారీగా కేటాయింపులు చేసి అర్హుల తుది జాబితా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తయారు చేస్తామని అన్నారు.
యాసంగి పంట కొనుగోలు పటిష్టంగా చేపట్టాం
గత వాన కాలం ఎటువంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశామని, అదేవిధంగా యాసంగి పంట కొనుగోలుకు పట్టిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. యాసంగి పంట సీజన్ లో పెద్దపెల్లి జిల్లాలో 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 13 వేల 573 రైతుల నుంచి 240 కోట్ల విలువ చేసే లక్షా 6 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 154 కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించామని కలెక్టర్ తెలిపారు. సన్న రకం ధాన్యం కొనుగోలు లో ఉన్న సమస్యలను పరిష్కరించామని, ఇప్పటివరకు ఐదువేల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని అన్నారు.
జిల్లాలో ఎటువంటి డిఫాల్ట్ లేని 105 రైస్ మిల్లులకు ముందుగా ధాన్యం కేటాయింపులు చేశామని , రైస్ మిల్లర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ జరిగేలా చూస్తున్నామని అన్నారు. గత వాన కాలంలో ఒకేరోజు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుతం రెగ్యులర్ గా 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని, యాసంగి పంటలో ఉత్పత్తి బాగా వచ్చినందున కొనుగోలు కేంద్రాలకు అధికంగా ధాన్యం వస్తుందని, నాణ్యత ప్రమాణాలు ఉన్న చివరి గింజ వరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని, అవసరమైన హమాలీలను అదనంగా బీహార్ నుంచి రప్పించామని అన్నారు. అకాల వర్షాలు కురిస్తే అవకాశం ఉన్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
జిల్లాకు 1940 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు
పెద్దపెల్లి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలలో 1940 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, 700 ఇండ్లు గ్రౌండ్ చేసామని, బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న 150 ఇండ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, ప్రతి సోమవారం ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి ప్రకారం నిధులు విడుదల అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మే 10 వరకు జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 చొప్పున ( పైలెట్ ప్రాజెక్టులో మంజూరు చేసిన మినహాయించి) లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు.
ఇందిరమ్మ కమిటీలు ఎంపిక చేసి అందించిన లబ్ధిదారుల జాబితాను అధికారులు మరోసారి వెరిఫై చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ కమిటీ అందించిన జాబితాలో ఎక్కడైనా అనర్హులు ఉంటే వారిని తొలగించి వారి స్థానంలో అర్హులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీ ఆమోదించిన దరఖాస్తుల ధ్రువీకరణ తర్వాత జిల్లా ఇంచార్జి మంత్రి ఆమోదంతో మంజూరు పత్రాలు పంపిణీ చేసి గ్రౌండ్ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలు ఎక్కడైనా అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే వెంటనే వాటిని రద్దు చేసే అధికారం జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం కేటాయించిందని, ఎక్కడైనా ఎవరైనా అనర్హులకు ఇండ్లు మంజూరు అయితే అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ప్రభుత్వం అసిస్టెంట్ ఇంజనీరు కేటాయిస్తుందని తెలిపారు.