కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 15: తెలంగాణలోనే యువత కలలు సాకారమవుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో లక్షా ముప్పైవేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 85 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారధి స్టడీ సర్కిల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని పేర్కొన్నారు. కరీంనగర్‌లోని కృషి భవన్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2018 నుంచి నిర్వహిస్తున్న వారధి స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని ఉద్యోగాలు సాధించిన వారిని ఆదివారం సత్కరించారు. ఈ కార్యక్రమానికి మేయర్ వై సునీల్‌రావు, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి, డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు పొన్నం అనిల్ గౌడ్, ఎస్సీ స్టడీ సరిల్ ఇన్చార్జి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత జకుల నాగరాజుతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న నేపథ్యంలో ప్రతిమ ఫౌండేషన్ వారధి స్టడీ సరిల్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఫౌండేషన్ చైర్పర్సన్ డాక్టర్ హరిణి నేతృత్వంలో కృషి భవన్లో సకల సౌకర్యాలు కల్పించామన్నామన్నారు. ఇందులో 37 మంది పోలీసు ఉద్యోగాలు, 287 మంది వివిధ శాఖల్లో ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం కరీంనగర్ గ్రంథాలయాన్ని డిజిటల్ లైబ్రరీగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందుకు రూ. 9 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కరీంనగర్ సమగ్రాభివృద్ధి కోసం మంతి గంగుల కమలాకర్, నేను కలిసి సీఎం కేసీఆర్ చొరవతో స్మార్ట్ సిటీ హోదాను సాధించామన్నారు. దీనిద్వారా విరివిగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాలు రాని వారు నిరుత్సాహ పడకుండా, పట్టుదలతో ముందుకెళ్లాలని ఉద్బోధించారు. ఇక్కడ చదువుకునే అభ్యర్థులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, రోజుకొక నిపుణుడితో ప్రత్యేక క్లాస్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.
యువత భవిష్యత్ కోసమే ఫౌండేషన్..
ఉద్యోగాలు సాధించిన వారి ముఖంలో సంతోషం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నది. యువత భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని ప్రతిమ ఫౌండేషన్ ఏర్పాటు చేశాం. వినోద్‌కుమార్ సూచనల మేరకు విద్యను దానం చేస్తే సమాజం బాగుపడుతుందని భావించి వారధి స్టడీ సరిల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి సౌకర్యాలు కల్పించి, శిక్షణ ఇప్పిస్తున్నాం ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు. యువతీయువకులు పట్టుదలతో చదివి మరిన్ని ఉద్యోగాలు సాధించాలి.
– డాక్టర్ హరిణి, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్
యువతకు సర్కారు పెద్దపీట
నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నది. యువత భవిష్యత్ బాగుండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు. ప్రతిమ ఫౌండేషన్ వారి సహకారంతో పోలీసు ఉద్యోగాలు సాధించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు.
– వై సునీల్ రావు, మేయర్
గొప్ప అవకాశంగా భావిస్తున్నా..
మాది జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వాంతాపూర్ గ్రామం. నేను కరీంనగర్ వచ్చి చదువుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారధి స్టడీ హాల్‌ను సద్వినియోగం చేసుకోవడం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. ఇది నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచి మా భవిష్యత్‌కు బంగారు బాటలు వేశారు.
– వినోద్‌కుమార్ జోగు, ఆర్ఎస్ఐ, జోన్-2
ప్రత్యేక తరగతులతో అవగాహన వచ్చింది
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తరగతుల ద్వారా పోటీ పరీక్షలపై పూర్తి స్థాయిలో అవగాహన వచ్చింది. స్టడీ సెంటర్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు ప్రిపేర్ అయ్యా. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతో పాటు, సౌకర్యాలు కల్పించడంతో ఓపెన్ కేటగిరీలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. నాకు చాలా గర్వంగా ఉంది.
– నమ్రత, సివిల్ కానిస్టేబుల్, రాంనగర్, (కరీంనగర్ )
ప్రతిమ ఫౌండేషన్ మేలు మరిచిపోం
ఏడాదిన్నర పాటు ప్రతి రోజూ ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ సెంటర్లో ప్రిపేర్ అయి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించా. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో స్టడీ సెంటర్‌కు వెళ్లాలంటే దాదాపు నెలనెలా రూ. 10 వేల వరకు ఖర్చయ్యేది. ప్రతిమ ఫౌండేషన్ ద్వారా మాకు హాల్ ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించి, ఉద్యోగ సాధనలో భాగస్వాములయ్యారు. ప్రతిమ ఫౌండేషన్ మేలు మేం మరిచిపోం.
– శ్రీలత, సివిల్ కానిస్టేబుల్, రేకుర్తి (కరీంనగర్)
పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయి
వారధి స్టడీ సెంటర్లో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన పుస్తకాలు ఉద్యోగ కల్పనకు చాలా ఉపయోగపడ్డాయి. మాకు కావాల్సిన పుస్తకాలన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేయడంతో పాటు మధ్యాహ్నం సమయంలో భోజనం, స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి మాకు ఎలాంటి లోటు లేకుండా చదువుకునే అవకావం కల్పించారు. ఇలాంటి స్టడీ సెంటర్లు యువతకు ఎంతో తోడ్పాటునందిస్తాయి.
– వెలిచాల వెంకటేశ్, కానిస్టేబుల్ కాపువాడ(కరీంనగర్)
ఆనందంగా ఉంది
మా నాన్న గొర్లకాపరిగా పనిచేస్తూ నన్ను డిగ్రీ వరకు చదివించాడు. ఆయన కష్టం చూసిన నేను ఎలా అయినా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కరీంనగర్ వచ్చాను. రెండు సార్లు పరీక్ష రాసినా ఉద్యోగం కొంచెంలో మిస్ అయ్యింది. ఈ క్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టడీ హాల్‌కు వచ్చి ప్రిపేర్ అయ్యాను. ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆనందంగా ఉంది.
– కుమార్ యాదవ్, ఏఆర్ కానిస్టేబుల్ (కొండపల్కల)