కమాన్ చౌరస్తా/ ఇల్లందకుంట, మార్చి 27: సీతారాముల కల్యాణాలు ఉమ్మడి జిల్లా లో శుక్రవారం వైభవోపేతంగా జరిగింది. వేమువా డలో రాములోరి పెండ్లి వేడుకలు నేత్రపర్వంగా సాగాయి. వేదమంత్రాల సాక్షిగా భాజభజంత్రీల చప్పుళ్ల నడుమ చైత్రశుద్ధ్ద నవమి పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్నం లో వివాహ ఘట్టం వేడుకగా జరిగింది. తరలివచ్చిన అశేష భక్తజనం, శివపార్వతులు జయజయధ్వానాలు చేస్తూ తిలకించి పులకించిపోయారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, బొప్పాపూర్తోపాటు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు ఆలయాల్లో వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, కల్యాణం తిలకించారు. ఆ రాముడి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇల్లందకుంటలో జానకీరాముల వివాహాన్ని కనులపండువలా జరిపించగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా పట్టువస్ర్తాలు సమర్పించారు. గోదావరిఖని కోదండరామాలయంలో జగదభిరాముడి పెండ్లి వైభవంగా జరిపించగా భక్తులు తిలకించి తన్మయత్వం చెందారు.