Additional Collector Aruna Sri | కోల్ సిటీ, మార్చి 29: ఉపాధ్యాయురాలు శశికళ తన నెల జీతం సమాజ సేవ కోసం వెచ్చించడం గొప్ప విషయ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ అన్నారు. సమాజ సేవ కోసం నెల జీతం వెచ్చించడం మామూలు విషయం కాదని, గొప్ప సంఘ సంస్కర్తలు చాలా అరుదుగా ఉంటారని, అందులో ఉపాధ్యాయురాలు శశికళ లో మరో మధర్ థెరిస్సాను చూస్తున్నామని పలువురు మహిళా సంఘాల సభ్యులు కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి, పిల్లలకు పాఠాలు చెప్పడం, అందుకు తగిన జీతం, ఇవే గాకుండా సమాజంలో అణగారిన పేద విద్యార్థుల భవిష్యత్ కోసం తన కుమారుడు అనుదీప్ పేరుమీద చారిటబుల్ ట్రస్టు స్థాపించి పేద విద్యార్థులకు చేయూత అందిస్తోన్న శశికళ ప్రతీ ఒక్కరికి ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా వృత్తి శిక్షణా కోర్సుల్లో తర్పీదు ఇస్తుందని, వీటంతటికి తన నెల జీతంను సైతం గోదావరిఖనికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు అట్లూరి శశికళ ధారాదత్తం చేస్తోందని కొనియాడారు. సమాజంలో విధి వంచితులైన పిల్లలకు సైతం మంచి భవిష్యత్ ఇవ్వాలని నిశ్చయించుకొని అనుదీప్ ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోందని చెప్పారు. మహిళలకు టైలరింగ్, బ్యుటీషియన్, జ్యూట్ బ్యాగుల తయారీలో శిక్షణ ఇస్తూ ఇప్పటివరకు 10 బ్యాచ్లను పూర్తి చేసి అందరికీ స్వయం ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. తన భర్త శేఖర్ రావు సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుందని చెబుతున్నారు. కాగా, మహిళా దినోత్సవం వేడుకల్లో సింగరేణి బంగ్లాస్ ఏరియాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారంను అందుకున్నారు. శశికళ సేవలు తమకు ఎంతో స్ఫూర్తి అని శ్రీ సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ, ఇతర సభ్యులు పేర్కొన్నారు. నెల జీతం మొత్తం సమాజ సేవకు వినియోగించడం గొప్ప విషయమని కొనియాడారు.