Tamilaga Vettri Kazhagam | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ఏకంగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నాడు. ఆదివారం పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసిన ఆయన, తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
తాను బ్యాలెట్ పేపర్‌పై ‘సి. జోసెఫ్ విజయ్’ అనే పేరుతో పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన పోటీ చేస్తున్న ఆ రెండు నియోజకవర్గాలు పెరంబూర్ (చెన్నై), తిరుచిరాపల్లి ఈస్ట్ (Trichy East). విజయ్ తన పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘విజిల్’ను ప్రస్తావిస్తూ.. ఇది కేవలం ఎన్నికలు కావని, ఇదొక “విజిల్ విప్లవం” అని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి భారీ బలం, బలగం లేని సాధారణ మధ్యతరగతి నేపథ్యం ఉన్నవారికే తాము టికెట్లు కేటాయించామని ఆయన తెలిపారు. ఈ పోరు కేవలం తమ ‘ప్రజల కూటమి (టీవీకే)’ మరియు ప్రస్తుత అధికార పక్షమైన ‘స్టాలిన్ కూటమి (డీఎంకే)’ మధ్య మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్.. ఈ రెండు నియోజకవర్గాలు కూడా ప్రస్తుతం అధికార డీఎంకే పార్టీ చేతిలోనే ఉన్నాయి. పెరంబూర్‌లో డీఎంకే ఎమ్మెల్యే ఆర్.డి. శేఖర్‌తో, తిరుచ్చి ఈస్ట్‌లో డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌తో విజయ్ తలపడనున్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ కొన్ని కీలక హామీలను ప్రకటించింది. రాష్ట్రంలో సంపూర్ణ డ్రగ్స్ రహిత సమాజం ఏర్పాటు చేయడం, నిరుద్యోగ యువతకు మరియు మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించడం, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావడం వంటివి ఇందులో ఉన్నాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.