Sircilla | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 20 : పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం సిరిసిల్ల డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రకాష్ రావు తెలిపారు. ఈ ప్రత్యేక యాత్ర జూలై 27 (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల న్యూ బస్ స్టాండ్ నుంచి సూపర్ లగ్జరీ బస్సులో ప్రారంభమై, జూలై 31న తిరిగి సిరిసిల్లకు చేరుకుంటుందని వెల్లడించారు.
యాత్రలో భాగంగా భక్తులు కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, వెల్లూరులోని శ్రీ లక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్, తిరువణ్ణామలైలోని శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవస్థానం దర్శించడంతో పాటు పౌర్ణమి సందర్భంగా అత్యంత విశిష్టమైన అరుణాచల గిరి ప్రదక్షిణలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం అలంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారి దేవస్థానాన్ని కూడా సందర్శించేలా యాత్రను రూపొందించినట్లు పేర్కొన్నారు. యాత్ర చార్జీలు పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,400గా నిర్ణయించినట్లు తెలిపారు. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల భక్తులు ముందస్తుగా తమ సీట్లను బుక్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ వివరాలకు: 9440521412, 9441670494, 6304171291, 9959225929ను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు.