సిరిసిల్ల గీతానగర్ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం దూరమైతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేమితో అధ్వానంగా మారుతున్నది. నీళ్ల చారు.. ఉడకని అన్నం.. నాణ్యతలేని పప్పు, చెడిపోయిన గుడ్లే ఇస్తుండగా, పిల్లల కడుపు మాడుతున్నది. ఈ పరిస్థితుల్లో పిల్లలు ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోవాల్సి వస్తున్నది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది.
సిరిసిల్ల తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 11 : సిరిసిల్ల గీతానగర్ పాఠశాల రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతి పెద్ద స్కూల్.. దాదాపు వెయ్యి మంది పిల్లలు.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఈ బడిని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దగా, ఆదర్శంగా మారింది. సంఖ్యా పరంగానే కాదు ఏటా ఫలితాల్లోనూ ముందు వరుసలో నిలిచింది. అయితే ఇప్పుడు పాఠశాల నిర్వహణ గాడితప్పింది. మొన్నటిదాకా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిచిన మధ్యాహ్న భోజన పథకం కొద్దిరోజులుగా అధ్వానంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం, పట్టింపులేమితో విద్యార్థుల కడుపుమాడుతున్నది. ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు, నాణ్యతలేని కూరలు, చెడిపోయిన గుడ్లు వడ్డిస్తుండగా, పిల్లలు తినలేకపోతున్నారు. కూరలు ఇంటి నుంచి తెచ్చుకుంటే అన్నమైనా బాగుంటుందా..? అని అంటే సరిగ్గా ఉండడం లేదని, రైస్ ఉడకడం లేదని, అందులోనూ పురుగులు ఉంటున్నాయని, తింటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. చేసేదేమి లేక నిత్యం 400 నుంచి 500 మంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఒక వేళ ఇంటి నుంచి భోజనం లేకపోతే మధ్యాహ్నం పస్తులుంటున్నారు. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహిస్తున్నారు. ఇంత మంచి పేరున్న పాఠశాలలో భోజనం ఇలా నాణ్యత లేకుండా పెడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడమే పేద విద్యార్థులకు శాపంలా మారిందని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయురాలు శారదను సంప్రదించగా, పాఠశాలలో భోజనం మంచిగానే తయారు చేయిస్తున్నామని చెప్పారు. కొందరు విద్యార్థులకు జ్వరాలు రావడం వల్ల పాఠశాలలో వండే ఫుడ్ రుచిగా లేదని, ఇంటి దగ్గరి నుంచి తెచ్చుకుంటున్నారని తెలిపారు.
రోజూ భోజనం తీసుకెళ్లి ఇస్త
నాది సుభాష్‌నగర్. మా అమ్మాయి గీతానగర్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నది. గతేడాది మధ్యాహ్న భోజనం బాగుండేది. కానీ కొన్ని నెలల నుంచే ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు పెడుతున్నరని పిల్లలు తినడమే మానేసిన్రు. పేరెంట్స్ మీటింగ్‌లో భోజనం గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. చేసేదేం లేక రోజూ మధ్యాహ్నం ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లి మా పాపకు ఇస్తున్న.
– విద్యార్థిని తండ్రి