Karimnagar | కమానౌచౌరస్తా, జూలై 25: తెలుగు నెలల్లో ఐదో నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతీ రోజూ ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండగలు మాత్రమే కాదు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలకు ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో శుక్రవారంతో ఈ సంవత్సరం శ్రావణ మాసం ప్రారంభం కాగా.. ఆలయాల్లో భక్తుల సందడి కనిపించింది.
పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని హనుమాన్ సంతోషి మాత ఆలయం, విద్యారణ్యపురిలోని మహాశక్తి ఆలయంలో పెద్దసంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొన్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అలాగే, కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో శ్రావణమాస ఆరంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి శ్రావణ మహోత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇక్కడ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.