Vemulawada | వేములవాడ, జనవరి 5 : రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి. శివ స్వాముల ఓం నమశ్శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్వంలో దాదాపు 300 మంది శివ భక్తులు శివుడి మాలధారణ స్వీకరించారు.
నుదుటన, విభూతి కుంకుమ ధరించిన శివ స్వాములకు అర్చకులు రుద్రాక్ష శివ మాల ధారణను గావించగా ప్రతీ యేటా శివరాత్రికి 41 రోజుల ముందు శివుని మాలధారణ చేసి, వచ్చే నెల 15న మహాశివరాత్రి రోజున లింగోధ్బవ సమయంలో మాల విరమణ చేస్తారు.
దాదాపు 35 సంవత్సరాల నుండి ప్రతియేటా రాజన్న దీక్షలు మాల ఆనవాయితీగా వస్తోంది. మానవుడు భగవత్ దీక్ష కలిగియుంటే అరిష్టాలు తొలిగి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కల్గుతాయని భక్తుల విశ్వాసం. దీక్షల్లో అత్యుత్తమైనది శివ దీక్ష, లయకారుడైనా శివుడిని రూపం ధరిస్తే మోక్షం కల్గుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన మహశివుడిని భక్తులు కొలుస్తారు. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలంలో మొదలైన శివదీక్షలు, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ వరకు విస్తరించాయి. ప్రతీ రోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం కఠిన నియామాలతో శివుడిని పూజిస్తూ, కఠిక నేలపై నిద్రిస్తారు.
వీటిలో శివ దీక్షలు మహామండలం 108 రోజు, మండల దీక్ష 41 రోజులు, అర్థమండల దీక్ష 21 రోజులు ధరిస్తారు. శివమాల ధరించే స్వాములు తప్పని సరిగా శివుడికి అభిషేకం చేసిన తర్వాతనే లింగం ధరించిన స్వాములు మాలలు వేస్తారు. చందన వర్ణం వస్ర్తాలను ధరించి, నుదుట విభూతి, కుంకుమ చందనం, మెడలో రుద్రక్షమాల ధరిస్తారు. దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని అర్చకులు వెల్లడిస్తుండగా దీక్ష దీక్షికరించిన స్వాములు ఆచరిస్తున్నారు.