CPI | చిగురుమామిడి, జూన్ 8: సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం(86) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన వెంకట్రాజం చిన్ననాటి నుండి కమ్యూనిస్టు బావాలను పునికి పుచ్చుకొని అనేక ఉద్యమాలలో మాజీ ఎమ్మెల్యే దేశిని మల్లయ్య, బద్దం ఎల్లారెడ్డి, ముస్కురాజిరెడ్డి, కూన ముత్యాలుతో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. బద్దం ఎల్లారెడ్డి, ముస్కు రాజిరెడ్డి స్ఫూర్తితో సీపీఐ లో అనేక పోరాటాలు చేశారు.
అంతేకాక పలుమార్లు జైలు జీవితం గడిపారు. విద్యార్థి వయసులోనే సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు పనిచేసి పార్టీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు. అనంతరం ఎంపీటీసీగా గెలుపొంది కొంతకాలం వైస్ ఎంపీపీ, ఎంపీపీగా కొనసాగారు. అనంతరం ఇందుర్తి సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. మెట్ట ప్రాంతమైన ఇందుర్తి (హుస్నాబాద్) నియోజకవర్గం ప్రాంతానికి సాగునీరు అందాలని వరద కాలువ పోరాటంను సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి తో కలిసి ఉద్యమం నిర్వహించారు. ఇటీవలనే కరీంనగర్లో నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభలకు హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఇతని మృతి పట్ల సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మర్రి వెంకటస్వామి, జిల్లా నాయకులు, మాజీ జెడ్పీటీసీ అందే స్వామి, కూన శోభారాణి, సీపీఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, రైతు సంఘం జిల్లా నాయకులు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి బాపురెడ్డి, బూడిద సదాశివ, అందే చిన్నస్వామి, మాజీ ఎంపీటీసీ అందే స్వప్న, కూన లెనిన్, చాడ శ్రీధర్ రెడ్డి, కొయ్యడ సృజన్ కుమార్, ముద్రకోల రాజయ్య, బోయిని అశోక్, గాదె రఘునాథరెడ్డి వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.